- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదే కరెక్ట్ టైమ్.. సమస్యలు పరిష్కరించాలని ఓటర్ల డిమాండ్లు
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తమ గ్రామ సమస్యలు పరిష్కరించుకోవాలని రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తమ గ్రామ సమస్యలు పరిష్కరించుకోవాలని రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించలేదని, ఇప్పుడు తమ డిమాండ్‌లు వారి ముందు ఉంచితే తప్పకుండా పరిష్కారం చేస్తారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల కోసమైనా వారు స్పందిస్తారని భావిస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కరించిన తరువాతే అధికారులు మా ఊర్లోకి రావాలంటూ కొందరు ఫ్లెక్సీలు ముద్రించి గ్రామాల పెలిమేరల్లో పెడుతున్నారు. తమ గ్రామంలో ఎవరూ నామినేషన్‌లు వేయరని, అదే సమయంలో బలవంతంగా ఎవరైనా నామినేషన్‌లు వేసినా ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనరని హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రతి గ్రామంలో ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారితో చర్చలు జరుపుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజలకు నచ్చిన నేతను ఎన్నుకోవాలని కోరుతున్నారు. సమస్యలను ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. పరిష్కారం అయ్యే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమని చెప్పడం సరికాదని గ్రామస్తులను బుజ్జగిస్తున్నారు. ప్రధానంగా రోడ్లు, వాగులపై బ్రిడ్జిల నిర్మాణం, తాగునీరు, విద్య, వైద్యం, కోతుల బెడద వంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎన్నికలు అయిపోతే ఎవరూ పట్టించుకోరు..
ఎన్నికలు ముగిశాక మళ్లీ తమను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోరని, సమస్యకు వెంటనే కచ్చితమైన సమాధానం ఉన్నతాధికారుల నుంచి వస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామంటూ గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించడంతో ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగుతున్నారు. అసలు సమస్య ఏమిటి..? ఇన్నాళ్లుగా ఎందుకు పరిష్కారం కాలేదు..? ఏ స్థాయిలో సమస్య నిలిచిపోయిందని ఆరా తీస్తున్నారు. అంతేకాక కింది స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఎన్నికల ద్వారా తమ గ్రామ సమస్యలు బయటి ప్రపంచానికి, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయని, ఇక సమస్య పరిష్కారం అవుతుందనే అంచనాలో ప్రజలు ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల తర్వాతనైనా సమస్యలు పరిష్కారం కాకుంటే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.






