ఓటరు జాబితా ఫ్రీజ్.. కొత్త ఓటర్ల నమోదు నిలిపివేత

by Naga Rani Yarlagadda |

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్) భాగంగా ఓటరు తాజా జాబితాను ఫ్రీజ్​చేశారు.

ఓటరు జాబితా ఫ్రీజ్.. కొత్త ఓటర్ల నమోదు నిలిపివేత
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్) భాగంగా ఓటరు తాజా జాబితాను ఫ్రీజ్​ చేశారు. సర్​పూర్తి అయ్యే వరకు ఇకపై కొత్తగా ఓటర్లను జాబితాలో చేర్చరు. ఇప్పుడు చేపడుతున్న ఎస్ఐఆర్​ప్రక్రియ అడ్డంకిగా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఉన్న ఓటరు ఆధారంగానే ప్రక్షాళన చేయనున్నారు. కొత్తగా ఓటర్లను చేర్చితే ప్రక్రియ మధ్యలో ఇబ్బందులు ఎదరవుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఎస్ఐఆర్​లో భాగంగా ఇప్పుడున్న ఓటరు జాబితాను ఫారాల రూపంలో ముద్రించి ప్రతి ఇంటికి పంపిణి చేయనున్నారు. ముద్రణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. 3.40 కోట్ల ఓటరు ఫారాలను ముద్రిస్తున్నారు. వీటిని ఓటర్లకు స్వయంగా బూత్​లెవల్​ఆఫీసర్లు (బీఎల్​ఓ)లు అందిస్తారు. ఓటర్లు బీఎల్‌వోలు ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని సమగ్ర వివరాలతో పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చిన దరఖాస్తు ఫారాలతో కలిపి ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. అప్పుడు ఆ జాబితాపై వచ్చే అభ్యంతరాలను స్వీకరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్​ మ్యాపింగ్​పూర్తి చేశారు. 70 శాతం ఓటర్ల మ్యాపింగ్​పూర్తి అయిందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొంచెం అటు ఇటుగా మ్యాపింగ్​అయిన వారే ఓటరు జాబితాలో మిగులుతారని విశ్లేషిస్తున్నారు. ఇకపై మ్యాపింగ్​కూడా ఉండదు. దరఖాస్తు ఫారాలను తిరిగి తీసుకొని ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించే సమయంలో అబ్సెంట్, షిప్ట్, డెట్, డబుల్ ఓటర్ల జాబితాను కూడా ప్రచురిస్తారు. వీరి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రత్యేక కిట్లు..

తెలంగాణ రాష్ట్రంలో 35,985 మంది బీఎల్‌వోలు ఉన్నారు. వీరందరికి ఎన్నికల సంఘం ప్రత్యేక కిట్లు అందించనుంది. విలువైన బ్యాగ్, ఓటరు నమోదు పత్రాలు, ఓటర్లు సందేహాలు తీర్చే పుస్తకాలు, ఎస్ఐఆర్ గురించి తెలిపే పుస్తకం, పెన్ను, పేపర్లు, క్యాప్, టీ షర్టులు, బ్యాడ్జి సహా దాదాపుగా వివిధ రకాల సామాగ్రిని అందులో పొందుపరిచి ఈ కిట్ల ద్వారా అందించనున్నారు. దీని కోసం కోట్ల రూపాయలను వెచ్చించినట్లుగా తెలిసింది. వీటిని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ వారంలో జిల్లాలకు వీటిని పంపిస్తారు. అనంతరం బీఎల్‌ఓలకు అందిస్తారు.

ఎస్ఐఆర్​షెడ్యూల్​ఎక్కడ..?

ఎస్ఐఆర్​పై రాష్ట్ర ఎన్నికల సంఘంలో స్పష్టమైన నిర్లక్ష్యం కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఎస్ఐఆర్‌పై కేంద్ర అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం అధికారుల నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. https://ceotelangana.nic.in/ వెబ్​ సైట్​లో ఎక్కడా కూడా ఎస్ఐఆర్​కు సంబంధించిన షెడ్యూల్ కనిపించడంలేదు. షెడ్యూల్‌నూ వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదు. దీనితో పాటుగా ఎస్ఐఆర్ అంటే ఏమిటి.. దానికి ప్రజల ప్రశ్నలు సమాధానాలను, దానికి సంబంధించి ఎవరి కాంట్రాక్టు కావాలనే సమాచారాన్ని ఎక్కడా పొందుపర్చలేదు. నేటి నుంచి ఈనెల 24 వరకు ప్రిపరేషన్, ట్రైనింగ్, ప్రింటింగ్ కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. ఈ నెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటికి తిరుగుతూ బీఎల్‌వోలు ఫారాలు అందిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. అక్టోబరు 1 తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. షెడ్యూల్​దగ్గరికి వచ్చినా వెబ్‌సైట్‌లో మాత్రం ఎక్కడా ప్రస్తావన లేకుండా 2002 ఓటరు జాబితాను మాత్రం పొందుపర్చారు. బీఎల్‌వోల సమాచారం, వారి ఫోన్​నెంబర్‌లు ప్రముఖంగా కనిపించే విధంగా పొందుపర్చలేదు. ఎస్ఐఆర్‌పై ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ ఓట్లు ఎక్కడ పోతాయోననే ఆందోళనలోవారు ఉంటే ఎన్నికల అధికారులు మాత్రం అందురు విరుద్ధంగా కనిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అర్హులైన ఓటర్లు ఓటరు జాబితాలో ఉండే విధంగా నియోజకవర్గాల వారిగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పార్టీలన్నీ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం దీనిపై అంత సీరియస్‌గా లేనట్లుగా ఉంది.

Next Story