- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుడు ‘ఓట్ చోరీ’.. ఇప్పుడు ‘సీటు చోరీ’: నామినేషన్ తిరస్కరణపై సీఎం రేవంత్ ఫైర్
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించడంపై సీఎం రేవంత్ రెడ్డి ‘X’ (ట్విట్టర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలోని ఈసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకుందని విమర్శించారు. గతంలో ఓట్ చోరీ, ఎస్ఐఆర్ (SIR) అవకతవకలకు పాల్పడిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా ‘సీట్ చోరీ’కి తెరలేపిందని సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక, ఇలాంటి దొడ్డిదారి కుట్రలతో ప్రతిపక్షాల సీట్లను దక్కించుకోవాలని చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసులు లేవు..
తెలంగాణలో ఉన్న పెండింగ్ కేసును అఫిడవిట్‌లో దాచారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తోసిపుచ్చారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు (Crimininal Cases) లేవని ఆయన స్పష్టం చేశారు. కేవలం సాంకేతిక కారణాలను సాకుగా చూపి, కావాలనే ఆమె నామినేషన్‌ను రిజెక్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, లోపలికి రానివ్వకుండా గేట్లకు తాళాలు వేసి అడ్డుకోవడంపై సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతలను ఈసీని కలవకుండా అడ్డుకోవడం దారుణమని, ఇది ప్రజల గొంతును నొక్కేయడమేనని అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత చీకటి రోజు అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మీనాక్షి నటరాజన్‌కు జరిగిన అన్యాయంపై తాము కోర్టుకు వెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






