ఇన్‌చార్జి మంత్రిగా ‘వివేక్’ ఫెయిల్? ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు

by Kema Shiva Kumar |

ఉమ్మడి మెదక్ జిల్లాలో.. కాంగ్రెస్ పార్టీ నేతల్లో నెలకొన్న కుమ్ములాటను పరిష్కరించడంలో ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఫెయిల్ అవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.

ఇన్‌చార్జి మంత్రిగా ‘వివేక్’ ఫెయిల్? ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లాలో.. కాంగ్రెస్ పార్టీ నేతల్లో నెలకొన్న కుమ్ములాటను పరిష్కరించడంలో ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఫెయిల్ అవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఆ జిల్లాలో గ్రూపు తగాదాలు రోజు‌రోజుకూ పెరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్నది. వివేక్‌కు రాజకీయ అనుభవం లేకపోవడం ఓ కారణమైతే, జిల్లాకు చెందిన సీనియర్ నేతల సలహాలు, సూచనలను తీసుకోకపోవడమూ మరో కారణమని తెలుస్తున్నది.

మెదక్ రాజకీయాలపై అవగాహన కరువు!

జూన్ రెండో వారంలో వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు కార్మిక, మైనింగ్ శాఖలు కేటాయించారు. అదే సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు సైతం అప్పగించారు. అప్పటి నుంచి ఆయన పలుసార్లు జిల్లా పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు యత్నించారు. నియోజకవర్గ లీడర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువర్గాల వాదనలూ విన్నారు. అయినా గ్రూపు రాజకీయాల్లో పరిస్థితి చక్కబడలేదు. ప్రధానంగా పటాన్ చెరులో నెలకొన్న గ్రూపు తగాదాల సమస్య ఇన్‌చార్జి మంత్రితో పరిష్కారం కాదని, నేరుగా సీఎం జోక్యం చేసుకోవాలనే అభిప్రాయాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాస్‌గౌడ్ మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా రాజకీయాలపై పెద్దగా అవగాహన లేని మంత్రి వివేక్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం కరెక్టు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీనియర్ల సలహాలు తీసుకోవడం లేదనే విమర్శలు

మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న రాజకీయ తగాదాలపై వివేక్‌కు పెద్దగా అవగాహన లేదని టాక్ ఉంది. అక్కడున్న సమస్యలు పరిష్కరించేందుకు ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నేతల సలహాలు తీసుకోవడం లేదని విమర్శలున్నాయి. అక్కడి నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలకు ఎలా పుల్‌స్టాప్ పెట్టాలో తెలుసుకునేందుకు మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భాలూ లేవని టాక్. ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీరు వల్ల సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమస్య పరిష్కరించేందుకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న వివేక్ కనీసం దృష్టి పెట్టలేదనే ఆరోపణలున్నాయి.

వివేక్ ముందే తోపులాటలు

ఈ నెల 8న గజ్వేల్‌లో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి వివేక్ సైతం హాజరయ్యారు. ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డిని వేదికపైకి పిలిచి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని పిలవకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను వివేక్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రోగ్రామ్‌లో పాల్గొన్న లీడర్లు తెలిపారు.

పనితీరుపై నిఘా వర్గాల రిపోర్టు

రెండు నెలల క్రితం కొన్ని జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను మార్చారు. ఆ తర్వాత పార్టీ, ప్రభుత్వ పథకాల అమలులో ఇన్‌చార్జి మంత్రుల పాత్రపై నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సీఎంకు రిపోర్టులు ఇస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి సురేఖను తప్పించి వివేక్‌కు ఆ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు నెలల కాలంలో పార్టీ తగాదాలు పరిష్కరించడంలో వివేక్ ఫెయిల్ అయినట్టు నిఘా వర్గాలు తమ రిపోర్టులో పేర్కొన్నాయని సమాచారం.

Next Story