వీసా మోసం కేసు మలుపు.. యూట్యూబర్ దంపతులపై లుకౌట్ నోటీసులు!

by Ramesh Naini |

ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు, షార్ట్ ఫిల్మ్ నటి రమా నందన (నందు), ఆమె భర్త మధుకర్‌లపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

వీసా మోసం కేసు మలుపు.. యూట్యూబర్ దంపతులపై లుకౌట్ నోటీసులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు, షార్ట్ ఫిల్మ్ నటి రమా నందన (నందు), ఆమె భర్త మధుకర్‌లపై పోలీసులు లుకౌట్ నోటీసులు (LOC) జారీ చేసినట్లు సమాచారం. పైకి అమాయకంగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన ఈ దంపతులు, తెరవెనుక భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిందితులు వేరే దేశంలో ఉండటంతో వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యూట్యూబర్ దంపతులు ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో వీసా రెన్యువల్ చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టించారు. పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివ క్రాంతి కుమార్ అనే బాధితుడు యూకేలో ఉంటున్న సమయంలో ఆయన వీసా గడువు ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఆయన సదరు కన్సల్టెన్సీ నిర్వాహకులను సంప్రదించాడు. ఇండియాలో ఉన్న తమ బ్రాంచ్‌లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రక్రియ అంతా పూర్తి చేస్తామని నిందితులు నమ్మబలకడంతో, బాధితుడు వారికి ఏకంగా రూ. 15 లక్షల వరకు చెల్లించాడు. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో పాటు, ఇచ్చిన డబ్బుల గురించి నిలదీస్తే నిందితుల నుంచి కనీస స్పందన లేదు. సరైన సమాధానం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శివ క్రాంతి కుమార్.. నేరుగా ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు..

డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందనతో పాటు గుంటూరులో ఉంటున్న మధుకర్ తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 515/2025 కింద, BNS చట్టంలోని 420, 318 (1) r/w 3(5) సెక్షన్ల కింద ఈ ముగ్గురిపై కేసులు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ బి.రాజు వెల్లడించారు. కాగా, గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నే రమా నందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. ‘నందూస్‌ వరల్డ్‌’ పేరుతో రమా నందన యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తోంది. ఈ ఛానల్ ద్వారా ఈ కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ సంపాదించుకుని ఇటీవలే మెగాస్టార్ నటించిన చిత్రంలో నందన ఓ పాత్రలో నటించే ఛాన్స్ సైతం కొట్టేశారు. యూకేలో ఉంటున్న వీరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.

విద్య, ఉపాధి నిమిత్తం యూకే వెళ్లే వారి కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో పలువురి నుంచి వసూళ్లు చేశారంటూ గతేడాది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే తామేమి తప్పుచేయలనేది నందు దంపతులు చెబుతుంటే, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ఈ దంపతుల మోసం బారిన పడిన వారిలో ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్, తదితర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

Next Story