కేబినెట్ హోదా కోసం జోరుగా లాబీయింగ్.. ఆ నేతల విశ్వ ప్రయత్నాలు

by Kema Shiva Kumar |

నామినేటెడ్, కార్పొరేషన్, కమిషన్ల చైర్మన్ల పదవులు పొందిన వారు ఇంకా సంతృప్తి చెందడం లేదు.

కేబినెట్ హోదా కోసం జోరుగా లాబీయింగ్.. ఆ నేతల విశ్వ ప్రయత్నాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నామినేటెడ్, కార్పొరేషన్, కమిషన్ల చైర్మన్ల పదవులు పొందిన వారు ఇంకా సంతృప్తి చెందడం లేదు. ఆ పోస్టుకు కేబినెట్ హోదా దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. దీని కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్‌కు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేటెడ్, కార్పొరేషన్ పదవులకు కేబినెట్ హోదా ఉండేదని, ఇప్పుడు లేకపోవడంతో అధికారులు తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని పెదవి విరుస్తున్నారు. ఇదే విషయాన్ని పలువురు సీఎం రేవంత్‌ వద్ద ప్రస్తావిస్తూ కేబినెట్ హోదా ఇప్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు ప్రచారంలో ఉన్నది. అందులో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్ల చైర్మన్లు, రాజ్యాంగ హోదాలలో సంస్థల అధిపతులు ఉన్నట్లు తెలుస్తున్నది.కొందరైతే ఏకంగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయగా, మరికొందరు గతంలో పార్టీ ఇన్‌చార్జిగా పని చేసిన వారి నుంచి లాబీయింగ్ చేసినట్టు ఆరోపణలున్నాయి.

కేబినెట్ హోదా అంటే..

మంత్రులతో సమానంగా ఇతర లీడర్లకు గౌరవ మర్యాదలు అందించడమే కేబినెట్ హోదా. జిల్లాలకు వెళ్తే కాన్వాయ్ వెంట రావడం, జిల్లా సరిహద్దులకు వెళ్లగానే ఆయా జిల్లాల ఉన్నతాధికారులు వచ్చి అధికార లాంఛనాలతో వెల్కమ్ చెప్పడం చేస్తుంటారు. ఆయన ఆ జిల్లా నుంచి వెళ్లేంత వరకు చుట్టూ అధికారులు ఫాలో అవుతుంటారు. ఒక్కసారి ఆ హోదాను అనుభవించిన లీడర్లు సడన్‌గా ఆ పదవి పోతే జీర్ణించుకోడానికి చాలా సమయం పడుతుంది. అందుకే అవకాశం ఉన్నన్ని రోజులు కేబినెట్ హోదాలో ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు.

బాధ్యతలు మర్చిపోతోన్న చైర్మన్లు

తమకు అప్పగించిన సంస్థలను ఎలా అభివృద్ధి చేయాలి ? అందుకోసం ఏం చేయాలి? అనే విషయాలను కార్పొరేషన్ల చైర్మన్లు, కమిషన్ల చైర్మన్లు, మెంబర్లు మర్చిపోతున్నారనే విమర్శలున్నాయి. కొందరైతే తమ సంస్థలకు నిధులే లేవని పెదవి విరుస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. కానీ ఉన్న సౌకర్యాలతో ఏ మేరకు సర్వీస్ చేయొచ్చనే విషయాన్ని పట్టించుకోవడం లేదనే టాక్ ఉన్నది.

ఇప్పటికే హంగామా చేస్తోన్న నేతలు

కొందరు కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్ చైర్మన్లు, మెంబర్లు కేబినెట్ హోదా లేకుండానే జిల్లాలకు వెళ్లినప్పుడు నానా హంగామా చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఫలానా డిస్ట్రిక్‌కు వస్తున్నట్లు ముందుగానే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీకి అధికారిక సమాచారం పంపుతున్నారు. సదరు లీడర్‌కు కేబినెట్ హోదా లేకపోవడంతో కలెక్టర్, ఎస్పీలు స్వయంగా వెళ్లకుండా, మర్యాద కోసం కింది స్థాయి అధికారులను పంపిస్తున్నారు. ఇది తెలుసుకున్న లీడర్లు ‘అగో మా దగ్గరకు కలెక్టర్, ఎస్పీ రాడా?మంత్రుల కంటే సీనియర్ లీడర్‌ను.. టైమ్ వచ్చినప్పుడు నా పవర్ ఎంటో చూపిస్తా’ అంటూ కామెంట్లు చేసినట్టు తెలుస్తున్నది. ఓ రాష్ట్ర స్థాయి సంస్థకు చైర్మన్‌గా ఉన్న ఓ నేత జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ‘నా దగ్గరకు మీరు ఎందుకు రారు.. నేను సీఎంకు చాలా క్లోజ్ మనిషిని’ అంటూ కలెక్టర్, ఎస్పీలను బెదిరించినట్లు టాక్. మరో చోట ఓ కమిషన్ మెంబర్ జిల్లా పర్యటనకు వెళ్తూ కారును మార్గమధ్యలోనే ఆపి.. అధికారులు అక్కడికే రావాలంటూ ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తున్నది.

ప్రస్తుతానికి ఇద్దరికే ఆ హోదా

ప్రస్తుతం మంత్రులు కాకుండా ఇద్దరు లీడర్లకే కేబినెట్ హోదా ఉంది. అందులో ఒకరు ప్రభుత్వ సలహాదారుడు కే.కేశవరావు, మరొకరు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి. మిగతా ఎవరికీ కేబినెట్ హోదా లేదు. అవసరం లేదనే అభిప్రాయంలో హైకమాండ్ సైతం ఉన్నది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా స్పందించలేదని తెలిసింది. కానీ భవిష్యత్‌లో భర్తీ చేయనున్న రెండు మూడు పదవులకు కేబినెట్ హోదా ఇవ్వాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారంలో ఉంది.

చిరునవ్వుతో నో చెబుతున్న సీఎం రేవంత్

కేబినెట్ హోదా కోసం సందర్భం వచ్చిన ప్రతిసారీ కొందరు లీడర్లు సీఎం రేవంత్ వద్ద అదే పనిగా ప్రస్తావిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఆ అంశం ప్రస్తావనకు వచ్చిన కొత్తలో ‘చూద్దాం’ అనే తీరుగా అన్సర్ ఇచ్చే వారని టాక్ ఉంది. కానీ మళ్లీ కలిసినప్పుడు అదే అంశం గురించి మాట్లాడితే.. సాధ్యం కాదని చెప్పకుండా చిరునవ్వు నవ్వి మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో ఆయన ఆ అంశాన్ని ఇక ప్రస్తావించొద్దు అనే తీరుగా సమాధానం ఇస్తున్నట్టు ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షంగా ఉన్న లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story