- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ దాడులు.. సీఎంఆర్ ధాన్యంలో రైస్ మిల్లుల గోల్ మాల్
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల చేపట్టిన ఆకస్మిక దాడులతో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విజిలెన్స్ (Vigilance Raids) ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల చేపట్టిన ఆకస్మిక దాడులతో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైస్ మిల్లర్లు కోట్లాది రూపాయల విలువ చేసే సీఎంఆర్ (CMR) ధాన్యం దారిమళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో ధాన్యం బస్తాలు మాయం అయినట్లు గుర్తించారు.
నిర్మల్ జిల్లా కడెం ప్రాంతంలో రైస్ మిల్లర్లు భారీగా సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్ళించారనే విశ్వసనీయ సమాచారం అందడంతో కరీంనగర్ విజిలెన్స్ యూనిట్ ఈ నెల 11వ తేదీన కట్టా బాలాజీ రైస్ మిల్‍లో సోదాలు నిర్వహించగా ఇందులో 2024-25 రబీ సీజన్‍కు సంబంధించి 2684 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం స్టాక్ దారి మళ్లించారని దీని విలువ 6.22 కోట్లు ఉంటుందని గుర్తించారు. సదరు మిల్లు యజమానిపై తదుపరి చర్యలు తీసుకునేలా పౌరసరఫరాల శాఖకు సమాచారం ఇచ్చారు. ఇక ఆర్‍సిపురం ఎన్ ఫోర్స్ మెంట్ యూనిట్ పౌర సరఫరాల శాఖతో కలిసి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్‍లోని ఎం/ఎస్ కన్యకా పరమేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ దాడిలో రబీ 2024-25 సీజన్‌కు సంబంధించిన 3752.80 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యం (382 బస్తాలు) తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.87,06,496 ఉంటుందని సదరు మిల్లు యజమానిపై తదుపరి చర్యలు ప్రారంభించడానికి సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల విభాగానికి సిఫార్సు చేశారు. ఈనెల 12వ తేదీన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని చాముండి రైస్ మిల్లు, వరాహి రైస్ మిల్లుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. రబీ, ఖరీఫ్ 2024-25 సీజన్‌కు సంబంధించిన మొత్తం 1,47,375 బస్తాల సీఎంఆర్ ధాన్యం స్టాకును దారి మళ్లించినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 13.67 కోట్ల ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించనున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ రూరల్ యూనిట్ అధికారులు ఈ నెల 11వ తేదీన శంషాబాద్ నుండి మహబూబ్‌నగర్‌కు పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఒక డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ పీఎస్ పరిమితులలోని పెద్ద షాపూర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి-44పై సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 15 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్రిమినల్ కేసుతో పాటు ఈసీ చట్టం కింద 6ఏ కేసు నమోదు చేయాలని పౌర సరఫరాల అధికారికి సిఫార్సు చేశారు. అదే రోజున హైదరాబాద్ సిటీ-2 యూనిట్ అధికారులు రవాణా మరియు మైనింగ్ శాఖ అధికారులతో కలిసి భూత్పూర్, జడ్చర్ల నుండి కొడంగల్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిపై రూట్ లో నిర్వహించిన తనిఖీల్లో అధిక లోడ్ తో వెళ్తున్న వాహనానికి రూ. 2,80,000జరిమానా విధించారు. రాయల్టీ ఉల్లంఘించినందుకు రూ.40 వేలు జరిమానా విధించారు. అలాగే సరైన పత్రాలు లేని రూ. 2 లక్షల విలువ కలిగిన ఒక వాటర్ ట్యాంకర్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 17 వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిని నాగర్ కర్నూల్ జిల్లా కర్వకుర్తి, తాడూరు పోలీస్ స్టేషన్లకు అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఫైర్ స్టేషన్ కు తరలించారు. ధాన్యం దారి మళ్లిస్తున్నట్లు గుర్తిస్తే టోల్-ఫ్రీ నంబర్ 14432 కు ఫోన్ చేసి విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కు సమాచారం అందించాలని తెలంగాణ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.






