‘హిల్ట్’ లీక్ వెనుక అమాత్యుడు..? గుర్తించిన విజిలెన్స్ అధికారులు

by Kema Shiva Kumar |

‘హిల్ట్’ పాలసీ లీక్ వెనుక ఓ మంత్రి, ఓ అధికారి ప్రమేయం ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

‘హిల్ట్’ లీక్ వెనుక అమాత్యుడు..? గుర్తించిన విజిలెన్స్ అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘హిల్ట్’ పాలసీ లీక్ వెనుక ఓ మంత్రి, ఓ అధికారి ప్రమేయం ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్ఎస్ లీడర్ల చేతుల్లోకి పాలసీ విషయాలు వెళ్లడంపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అందులో భాగంగా అధికారులు తమ రిపోర్టును నేరుగా సీఎం‌కు అందించినట్టు సమాచారం. దీంతో సదరు మంత్రి, ఆఫీసర్ పాలసీని ఎందుకు లీక్ చేశారనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. పాలసీ అమలు ఇష్టం లేదా? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో సదరు మంత్రి సన్నిహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.

జీవో విడుదల కాకుండానే..

ఏదైనా పాలసీలోని అంశాలను బయటకు తెలిపేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది.కానీ, హిల్ట్ పాలసీకి సంబంధించి జీవో రిలీజ్ కాకముందే, అందులోని అంశాలు లీకయ్యాయి. నవంబరు 17న పాలసీని కేబినెట్ ఆమోదించింది. అనంతరం రెండు రోజుల తర్వాత పాలసీలోని అంశాలపై బీఆర్ఎస్ మీడియా సమావేశం నిర్వహించింది.ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాలసీ అంశాలు లీక్ చేసిన వ్యక్తులను గుర్తించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఆ టీమ్ ఓ పది రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. పాలసీ తయారీలో భాగస్వామ్యం ఉన్న శాఖలు, అధికారులను ఒక్కొక్కరిని పిలిచి విచారించింది.కేబినెట్ సమావేశం తర్వాత పాలసీలోని అంశాలు బయటకు వెళ్లడంలో ఓ అధికారి ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ టీమ్ నిర్ధారణకు వచ్చింది.ఆ్నయన్ను పలుమార్లు ప్రశ్నించడంతో ఓ మంత్రి ఆదేశాల మేరకు పాలసీలోని అంశాలను లీకు చేశానని సమాధానమిచ్చినట్టు టాక్.ఇదే విషయాన్ని విజిలెన్స్ బృందం తమ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది.

మంత్రికి ఏం ప్రయోజనం?

పాలసీలోని అంశాలను ఎందుకు లీక్ చేశారు? దాని వల్ల ఆ మంత్రికి ప్రయోజనం ఏంటి? పాలసీ‌పై ఇష్టం లేకుంటే నేరుగా తనకే వివరించవచ్చు కదా? అనే కోణంలో సీఎం రేవంత్‌రెడ్డి సదరు మంత్రి సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తున్నది.ఇదిలాఉండగా హిల్ట్ పాలసీపై కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజును కట్టేందుకు భూ యజమానులు ముందుకు రారని, ఫీజు తక్కువగా ఉంటే బాగుండేదని తమ అభిప్రాయాలను చెప్పినట్టు టాక్.

కప్పిపుచ్చుకునేందుకే మంత్రిపై నిందా?

నిజానికి పాలసీని అధికారి లీక్ చేసి, తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రి పేరును ప్రస్తావించారా? లేక నిజంగా మంత్రి ఆదేశాల మేరకే ఆ పనిచేశారా? అనే చర్చ జరుగుతున్నది. ఇండస్ట్రీయల్ ఏరియాలో ఆ అధికారి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ భూములను ఇతర అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు ఎక్కువగా ఉందని భావించి, పాలసీలోని అంశాలను విపక్షాలకు లీక్ చేశారని ప్రచారం జరుగుతున్నది.

Next Story