- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణికి కరువైన ఆదరణ.. టౌన్ ప్లానింగ్ పై పేరుకుపోయిన పిటిషన్లు
జీహెచ్ఎంసీలో ప్రతినెలా నిర్వహిస్తున్న ప్రజావాణికి ఆదరణ సన్నగిల్లుతోంది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీలో ప్రతినెలా నిర్వహిస్తున్న ప్రజావాణికి ఆదరణ సన్నగిల్లుతోంది. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ పరిధిలో ప్రజావాణిలో వస్తున్న ఏ ఒక్క ఫిర్యాదుకూ మోక్షం లభించకపోవడమే నిదర్శనం.
ఫిర్యాదులు అనేకం
జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్ అండ్ శానిటేషన్, యూసీడీ, ఇంజినీరింగ్, యూబీడీ, ఎలక్ట్రికల్ సెక్షన్లలో ఉన్న సమస్యలపై కొద్ది కాలంగా జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తూ వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కేవలం ఒకే సెక్షన్‌కు సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం. చందానగర్ సర్కిల్ పరిధిలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో కేవలం టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు సంబంధించి అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. మిగతా సెక్షన్ల నుంచి నామమాత్రంగా శాఖకు ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంబంధిత సెక్షన్‌పై కొద్దిరోజులుగా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజావాణిలో కేవలం ఒక్క సెక్షన్‌పైనే ఆరోపణలు రావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు సంబంధించి రెండు వారాల క్రితం 11 ఫిర్యాదులు రాగా, పోయిన సోమవారం 9 ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా సోమవారం కేవలం టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి 15 ఫిర్యాదులు రావడం గమనార్హం.
ఫిర్యాదులు సరే.. చర్యలు ఏవీ?
చందానగర్ సర్కిల్‌కు సంబంధించి టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో ప్రతివారం ఫిర్యాదులు వస్తున్నా.. వాటిని పట్టించుకోవడం లేదు. ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదులు స్వీకరించి ఫొటోలు దిగడం మినహా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని, అలాంటప్పుడు ప్రజావాణి నిర్వహణ పేరుతో సమయం వృథా ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులపై టీపీఎస్ అధికారులు కావాలనే చర్యలు తీసుకోవడం లేదని, ఇల్లీగల్ నిర్మాణాల వెనక అంతా తామే అయి నడిపిస్తున్నారని, ముడుపులు తీసుకుని మిన్నకుండి చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చందానగర్ ఏసీపీపై చర్యలకు వెనకాముందు
అయ్యప్ప సొసైటీ బిల్డర్లకు వంతపాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారిపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సదరు అధికారి నాలుగు రోజులుగా కార్యాలయానికి రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. సోమవారం మీటింగ్ ఉందని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి వచ్చిన అధికారి, అనారోగ్య కారణాలతో అటు నుంచి అటే ఇంటికి వెళ్లిపోయారే కానీ చందానగర్ కార్యాలయానికి రాలేదు. ‘దిశ’ పత్రికలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో అధికారి నుంచి వివరణ తీసుకోవాలంటూ జోనల్ కమిషనర్ స్వయంగా చందానగర్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాసినట్లు సంబంధిత కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు అయ్యప్ప సొసైటీలోని ఇల్లీగల్ నిర్మాణాలను గురువారం సీజ్ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.






