దోషులను పట్టుకోవడమే విజిలెన్స్ పనికాదు: శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ప్రతీ వ్యక్తి కేవలం వృత్తి జీవితంలోనే కాకుండా నిత్య జీవితంలోనూ నీతి, నిజాయతీల అత్యున్నత ప్రమాణాలను పాటించినప్పుడే అన్ని వ్యవస్థలు

దోషులను పట్టుకోవడమే విజిలెన్స్ పనికాదు: శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ వ్యక్తి కేవలం వృత్తి జీవితంలోనే కాకుండా నిత్య జీవితంలోనూ నీతి, నిజాయతీల అత్యున్నత ప్రమాణాలను పాటించినప్పుడే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయడమే కాకుండా ప్రజలకు పారదర్శక సేవలు అందించడం సాధ్యమవుతుందని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్(Vigilance DG Shikha Goyal) పేర్కొన్నారు. భారతీయ ఇతిహాసాలతోపాటు శతాబ్దాలుగా వస్తున్న వారసత్వ విలువల్లోనూ సత్య, ధర్మ మార్గంలో వెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రబోధించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజిలెన్స్ వారోత్సవాలను కేవలం వారం రోజులకు పరిమితం చేయకుండా అన్ని రోజులు కూడా నిబద్ధతతో పనిచేయాలన్నారు. నీతి, నిజాయతీ, పారదర్శకత పాటించడం వల్ల కష్టాలు మాత్రమే మిగులుతాయని, పనులు పూర్తి కావన్న అపనమ్మకాన్ని దూరం చేసుకోవాలన్నారు.

ప్రతీ ఒక్కరూ ప్రతీ అంశాన్ని మానవీయ కోణంతో చూడాలన్నారు. నిజాయతీతో పనిచేయడం ద్వారా ఢిల్లీ మెట్రో రైలును సకాలంలో, తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలమని శ్రీధరన్ నిరూపించారని, సహకార రంగంలో పారదర్శకతను పాటించడం ద్వారా అమూల్ ద్వారా క్షీర విప్లవాన్ని సృష్టించిన కురియన్లు కూడా నైతిక విలువలకు గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు. ఇలా ఎందరో వ్యక్తులు నిజాయతీతో సేవలు అందించి ప్రజల మన్ననలు అందుకున్నారని తెలిపారు. అదే సమయంలో నిజాయతీగా ఉంటూ పనులు చేయకపోవడం కూడా నేరమే అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పౌరులకు పారదర్శక సేవలు అందించడం ద్వారా అవినీతిని కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. విజిలెన్స్ అంటే ప్రతీ ఒక్కరినీ నేరస్థులుగా చూడటం, నేరస్థులను పట్టుకోవడం కాదని, నేరం జరగకుండా, ఎవరూ నేరం చేయడానికి సిద్ధపడకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయడమే విజిలెన్స్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

నిజాయతీగా పనిచేసిన వారి గొప్పతనం గురించి సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని, ఆత్మ సంతృప్తి కోసం అంతరాత్మను వంచించుకోకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి ఉద్యోగులను ఉద్దేశించే అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎండీ ఎన్.బలరామ్ అధ్యక్షత వహించి మాట్లాడారు. సింగరేణి 136 ఏళ్ల ప్రస్తానంలో సాధించిన విజయాలను, సింగరేణి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో చేపడుతున్న విస్తరణ ప్రణాళికలను, సింగరేణిలో మహిళా సాధికారత కోసం చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం శిఖా గోయల్‌ను ఘనంగా సన్మానించారు. సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్ మెంట్ మరియు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story