- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KNRUHS: కాళోజీ హెల్త్ వర్సిటీలో మార్కుల గోల్‌మాల్..! విజిలెన్స్ తనిఖీలు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ వైద్య పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ వైద్య పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో కలకలం రేపింది. మార్కుల మాయచేసి ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేసినట్టు వెలుగులోకి రావడంతో యూనివర్సిటీలో ఇవాళ (సోమవారం) విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నెల 4వ తేదీన విడుదలైన పీజీ ఫలితాల్లో ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ విద్యార్థుల మార్కులు మారి, వారిని పాస్ అయ్యారని చూపించడం అనుమానాస్పదమై సహచర విద్యార్థులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.
ఫెయిల్ నుంచి పాస్ అయిన వారంతా ఒకే ప్రైవేట్ కాలేజీకి చెందినవారే కావడం, పేపర్ వాల్యుయేషన్‌లో గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌పై దాడులు నిర్వహించారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు రికార్డులు, రీకౌంటింగ్ పత్రాలను పరిశీలిస్తున్నారు. పేపర్ వాల్యుయేషన్‌లో, రీకౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు అధికారుల సమాచారం. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో అధికారులు త్వరలో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.
కాగా, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ తనిఖీలపై రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 150 మంది వైద్య విద్యార్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, రీకౌంటింగ్ లో అభ్యర్థులు ఎవరూ పాస్ కాలేదని తెలిపారు. మార్కుల గోల్ మాల్ ఆరోపణలపై విజిలెన్స్ తనిఖీ జరుగుతోందని వెల్లడించారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో రికార్డుల తనిఖీలు జరుగుతున్నాయని, అక్రమాలు జరిగినట్లు తేలితే, చర్యలు ఉంటాయని తెలిపారు.






