దేశం పరువు తీస్తున్నారు కదరా..! చార్మినార్ వద్ద విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఆగ్రహం

by Ramesh Naini |   (  Updated:2025-10-05 11:49:28  IST  )

చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దేశం పరువు తీస్తున్నారు కదరా..! చార్మినార్ వద్ద విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో : (Viral Video) హైదరాబాద్ నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. రాత్రి సమయాల్లో రోడ్లపై ప్రమాదకర బైక్ స్టంట్‌లు వేయడమే కాకుండా.. పండుగ సమయాల్లో మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇటీవల బోనాలు, వినాయక చవితి సమయంలో మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వందల మంది పోకిరీలను షీటీమ్స్ బృందాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన (Charminar) చార్మినార్ వద్ద ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ వీడియో ప్రకారం.. హైదరాబాద్‌ చార్మినార్ వద్ద కొంత మంది లోకల్ యువకులు టీ తాగుతూ ఉన్నారు. అదే సమయంలో ఓ విదేశీ జంట చార్మినార్ అందాలను కెమెరాల్లో రికార్డు చేస్తూ చక్కర్లు కొడుతుండగా.. మహిళపై ఓ పోకిరి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను వెంటనే పసిగట్టిన విదేశీ మహిళ స్నేహితుడు.. ఆ పోకిరి దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగానే ‘జాగ్రత్త’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఆ పోకిరి ‘ఓకే బ్రదర్’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనను వారి కెమెరాల్లో రికార్డ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌ అయింది.

దేశం పరువు తీస్తున్నారు కదరా.. అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోకరీపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులకు ఆదేశాలిచ్చారు. పోలీసులు వీడియో ఆధారంగా పోకిరీలను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీడియో ఇదే..

Next Story