నియంతృత్వంపై ప్రజాస్వామ్య విజయం.. డీలిమిటేషన్ బిల్లుకు చెక్: కూనంనేని

by Ramesh Naini |

నియంతృత్వంపై ప్రజాస్వామ్య విజయం.. డీలిమిటేషన్ బిల్లుకు చెక్: కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, నియంతృత్వాన్ని ప్రజాస్వామ్యం ఓడించిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ హాల్లో నాయకురాలు లక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన సీపీఐ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా సమితి కార్యవర్గ సమావేశానికి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ మోడీ, అమిత్ షా ద్వయం నియంతృత్వంగా డిలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని ప్రతిపక్షాలు అన్ని ఏకమై ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాయన్నారు. డీలిమిటేషన్ బిల్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా నిలుస్తోందన్నారు . ప్రజల ప్రతినిధిత్వాన్ని సమానంగా కల్పించాల్సిన ప్రక్రియను రాజకీయ లాభాల కోసం వక్రీకరించే ప్రయత్నంగా ఈ బిల్లు కనిపిస్తోందని ఏద్దేవా చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం కోసం ఉండాలని, ఈ బిల్లు ద్వారా కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలపై వివక్ష చూపుతూ, ఉత్తర భారత రాష్ట్రాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే కుట్ర అని వారు అభివర్ణించారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు సమాన విలువ కలిగి ఉండాలని, కానీ ఈ బిల్లు అమలు అయితే ప్రాంతాల మధ్య అసమానతలు మరింత పెరిగి, సమతుల్యత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. సీపీఐ తరఫున మేము ఈ బిల్లును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, పారదర్శకత లేకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీఎస్.బోస్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి, కల్లూరు ధర్మేంద్ర , సాయిలు గౌడ్, స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్, కృష్ణ, హరినాథ్ రావ్, రచ్చ కిషన్, శంకర్ రావు, సత్య ప్రసాద్ లతో పాటు అన్ని మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story