ఫేక్ న్యూస్ ఏదో మీడియా ద్వారే తెలుస్తోంది: ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్

by Gantepaka Srikanth |

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోందని.. ఈ తరుణంలో అసలు వార్తలు ఏమిటో, ఫేక్ వార్తలేమిటో చెప్పాల్సింది మీడియా మాత్రమేనని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

ఫేక్ న్యూస్ ఏదో మీడియా ద్వారే తెలుస్తోంది: ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోందని.. ఈ తరుణంలో అసలు వార్తలు ఏమిటో, ఫేక్ వార్తలేమిటో చెప్పాల్సింది మీడియా మాత్రమేనని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డ్రగ్స్ రక్కసిపై అంతా పోరాటం చేయాలని ఇందుకు మీడియా ప్రధాన భూమిక వహించాలని ఆయన కోరారు. డ్రగ్స్ ఫ్రీ ఇండియాగా మార్చడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు 89వ జయంతి సందర్భంగా ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా మాట్లాడారు. మీడియాలో రామోజీరావు ఓ పయనీర్ లాంటి వారని.. ఈనాడు, ఈటీవీ నెట్వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీ, రామోజీ గ్రూప్ ద్వారా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆయన అందించిన సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు.

ఓ కుగ్రామం నుంచి వచ్చి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారని కొనిడాయారు. సిబ్బందిలో రామోజీరావు టీఎం స్పిరిట్ నింపేవారని.. ఆలోచనలను సంస్థలుగా తీర్చిదిద్దిన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా స్పందించేవారని.. ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల నుంచి నిధులు సేకరించి వాటితో బాధితులకు సాయం చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అన్నారు. ఎథికల్ జర్నలిజానికి ఆయన మరోపేరుగా నిలిచారని కొనియాడారు. రామోజీ ఎక్సలెన్సీ అవార్డులు ఆయన గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలు గుర్తించుకునేందుకు ఓ మైలురాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయన ఎందరికో స్ఫూర్తివంతంగా నిలిచారని అన్నారు. స్క్రిప్ట్‌తో వచ్చి సినిమా ప్రింటుతో బయటకు వెళ్లేలా రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారంటే రామోజీ విజన్‌ను అర్థం చేసుకోవచ్చని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. విలువలతో కూడిన వ్యాపారం చేశారని అన్నారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన, సమాజహితమే లక్ష్యంగా కష్టపడుతున్న ఏడుగురికి రామోజీ పురస్కారాలను అందచేసారు. అవార్డులు అందుకొన్న వారిలో అమలా రూయా (గ్రామీణాభివృద్ధి విభాగం), శ్రీకాంత్‌ బొల్లా (యూత్‌ ఐకాన్‌), మాధవీలత (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ), ఆకాశ్‌ టాండన్‌ (మానవసేవ), ప్రసన్న శ్రీ (కళ- సంస్కృతి), జైదీప్‌ హార్దికర్‌ (జర్నలిజం), పల్లవి ఘోష్‌ (మహిళా సాధికారత) ఉన్నారు.

Next Story