అపోహలను నమ్మోద్దు.. వ్యవసాయ వర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. వైస్ ఛాన్సలర్ కీలక ప్రకటన

by Ramesh Naini |

రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని (Jayashankar Agricultural University) వ్య‌వ‌సాయ యూనివ‌ర్సిటీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.

అపోహలను నమ్మోద్దు.. వ్యవసాయ వర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. వైస్ ఛాన్సలర్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని (Jayashankar Agricultural University) వ్య‌వ‌సాయ యూనివ‌ర్సిటీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. అక్కడి బొటానిక‌ల్ గార్డెన్‌లోని భారీ వృక్షాల‌ను దాదాపు 20 జేసీబీలతో తొల‌గిస్తున్న‌ట్టు ప్రచారం జరిగింది. వ‌న మ‌హోత్స‌వం పేరుతో 20 ఎక‌రాల‌ను చ‌దును చేసేందుకు ఇలా చేశార‌ని వార్త‌లు వినిపించాయి. దీనిపై జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్య (VC Dr. Aldas Janaiah) స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రేపు జరిగే (van mahotsav) వన మహోత్సవ కార్యక్రమంపై కొందరు అసత్యాలను, అవాస్తవాలను కొన్ని సోషల్ మీడియాల వేదికగా ప్రచారం చేస్తున్నారని వర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య తెలిపారు. ఇవి పూర్తిగా అవాస్తవం అని, ఇలాంటి అసత్యాల ప్రచార ప్రభావానికి ఎవరూ లోను కాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలో ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న బొటానికల్ గార్డెన్ గత 15 ఏళ్ల నుంచి నిరాదరణకు గురికావడంతో సుబాబుల్, యూకలిప్టస్ లాంటి వాతావరణానికి దుష్ప్రభావాలు కలిగించే చెట్లు ఉండటం వలన మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న సుబాబుల్, యూకలిప్టస్ చెట్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో ప్రయోజనకరమైన సాంప్రదాయ పండ్ల మొక్కలను, ఇతర అటవీ జాతి మొక్కలను నాటి పెంచే కార్యక్రమాన్ని హెచ్ఎండీఏ చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే సుబాబుల్, యూకలిప్టస్ చెట్లను తొలగించే పనులను చేపట్టామని స్పష్టం చేశారు. దీనిపై వచ్చే ఎలాంటి అపోహలను ప్రజలు నమ్మోద్దని విశ్వవిద్యాల వైస్ ఛాన్సలర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన వన మహోత్సవం కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జులై 7 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్ధులతో పాటు ప్రకృతి ప్రేమికులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

యూనివర్సిటీ క్యాంపస్ ప్రస్తుతం లాంటానా, పార్థీనియం, ప్రోసోపిస్ జూలిఫ్లోరా వంటి కలుపు మొక్కలతో నిండిపోయి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అదనంగా, యూకలిప్టస్, సుబాబుల్ వంటి విదేశీ జాతుల మొక్కలు విపరీతంగా పెరిగిపోయి, ఈ కలుపు మొక్కలు, విదేశీ జాతులను తొలగించి, కొత్త, విలువైన మొక్కలను నాటడానికి స్థలం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం యూకలిప్టస్, సుబాబుల్‌తో నిండి ఉన్న సుమారు 150 ఎకరాలను వన మహోత్సవంలో భాగంగా విలువైన కలపను ఇచ్చే రకాలను నాటడానికి ఖాళీ చేయనున్నారు. ముఖ్యంగా, గత నెలలో, 150 ఎకరాల పాత స్థలాల నుంచి యూకలిప్టస్, సుబాబుల్‌ను తొలగించడానికి పీజేటీఏయూ ఐటీసీ కంపెనీకి టెండర్లు మంజూరు చేసింది. రాబోయే కొత్త సాంప్రదాయ తెలంగాణ స్థానిక జాతుల పెంపకం కోసం స్థలాన్ని సృష్టించడానికి చెట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని వైస్ ఛాన్సలర్ స్పష్టం చేశారు.

Next Story