సిడ్నీ యూనివర్శిటీ, జయశంకర్ ​అగ్రికల్చర్​ యూనివర్శిటీ మధ్య ఒప్పందం: వైస్​ చాన్స్​లర్​ జానయ్య

by Ajay Maddhiboyina |

ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం వెస్ట్రన్ సిడ్ని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయాన్ అండర్సన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది.

సిడ్నీ యూనివర్శిటీ, జయశంకర్ ​అగ్రికల్చర్​ యూనివర్శిటీ మధ్య ఒప్పందం: వైస్​ చాన్స్​లర్​ జానయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం వెస్ట్రన్ సిడ్ని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయాన్ అండర్సన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఇతర అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. మంగళవారం వ్యవసాయ విద్య, పరిశోధన రంగాలలో సంయుక్తంగా చేపట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు సంవత్సరాలు జయశంకర్​యూనివర్శిటీలో, నాలుగో సంవత్సరం సిడ్నీ లోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో చదువుకునే విధంగా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం పై ఒప్పందం జరిగింది. నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అగ్రికల్చర్​యూనివర్శటీ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీని ,వెస్ట్రన్ సిడ్ని యూనివర్సిటీ నుంచి బీఎస్సీ వ్యవసాయ ఆహార శాస్త్రంలో డిగ్రీని పొందుతారు.

విద్యార్థులు తదుపరి పీజీ, పీహెచ్డీ కోర్సులను వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో నేరుగా చేసుకొనే విధంగా ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం 25 నుంచి 30 మంది విద్యార్థులకు ఆస్ట్రేలియాలో నేరుగా చదువుకునే అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అయాన్ అండర్సన్ మాట్లాడుతూ భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఇప్పటికే డబ్ల్యూ.ఎస్. యుతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, దాని ప్రకారం భారతదేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో సంయుక్తంగా విద్య, పరిశోధనా రంగాలలో కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. గత కొన్ని నెలలుగా చర్చల అనంతరం ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం ఈ సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే విధంగా అగ్రి రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలపై ఒప్పందం కుదరటం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రసంగిస్తూ గత ఏడాది కాలం నుండి నాలుగు, అంతర్జాతీయ, ఐదు జాతీయ సంస్థలతో వ్యవసాయ విద్య, పరిశోధన రంగాలలో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని వివిధ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరంలో 25 మంది విద్యార్థులకు పీ జే టి ఏ యు - వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కింద ప్రవేశాలు కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మార్క్, డాక్టర్ నిషా రాకేష్, డాక్టర్ కోపల్ చౌబే తో పాటు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డీన్స్ డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ ఈశ్వరి, డాక్టర్ రమణారావు తో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story