- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మ కుంట తీర్పుపై VH సంచలన వ్యాఖ్యలు
అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట భూవివాదం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట భూవివాదం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు (వీహెచ్) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంటను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వీహెచ్ న్యాయ వ్యవస్థ పనితీరుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "రాజకీయ నాయకులను ఎవరైనా ఏమైనా అనొచ్చు, కానీ జడ్జీలను ఒక్క మాట అంటే చాలు.. తెల్లవారేసరికి నోటీసులు పంపుతారు. న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు. హాజీపూర్ లాంటి ఘోరమైన కేసుల్లో ఆరేళ్లు గడిచినా బాధితులకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని, కానీ బతుకమ్మ కుంట విషయంలో కోర్టు ఇంత వేగంగా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన విమర్శించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో బోర్డుల తొలగింపు..
మరోవైపు, బతుకమ్మ కుంట విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థలం హైడ్రా (HYDRAA) ఆధీనంలో ఉందన్న సంకేతాలను తక్షణమే తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో, అక్కడ ఏర్పాటు చేసిన హైడ్రా నేమ్ బోర్డులను అధికారులు తొలగించారు. గతంలో ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించిన హైడ్రా, ఇక్కడ చిల్డ్రన్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్ వంటి వసతులతో బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసింది. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అయితే.. మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంటపై యాజమాన్య హక్కుల వివాదం ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది. ప్రజల కోసం అభివృద్ధి చేసిన పార్కును, కుంటను కాపాడుకోవడానికి పోరాటం కొనసాగిస్తామని వీహెచ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






