డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారు.. వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పార్టీలు మారే రాజకీయ నాయకులపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారు.. వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీలు మారే రాజకీయ నాయకులపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ‘ప్రజలే నా ఆత్మకథ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొని మాట్లాడారు. దత్తాత్రేయ(Bandaru Dattatreya) జీవిత చరిత్ర ప్రజలకు అవసరం లేదని అన్నారు. ఆయన జీవితమంతా తెరిచిన పుస్తకం లాంటిదని.. మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. పదవులు ఉన్నా.. లేకున్నా.. దత్తాత్రేయ ఒకే పార్టీలో కొనసాగారు అని అన్నారు. కొంతమంది పిల్లలకు డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు. విలువలతో కూడిన విమర్శలు చేయాలి.. అవి కూడా పదునుగా ఉండాలని సూచించారు. విమర్శలు ఎప్పుడూ కూడా దిగజారి చేయకూడదు అని అన్నారు.

బూతులు మాట్లాడేవారిని ప్రజలు కూడా సహించొద్దని.. ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. లక్ష్యం, అంకితభావంతో పనిచేసే వారి సంఖ్య రాను రాను తగ్గిపోతోందని అన్నారు. నేటి తరం రాజకీయ నాయకులు దత్తాత్రేయను ఆదర్శంగా తీసుకోవాలి.. విలువలతో కూడిన రాజకీయం చేయాలని సూచించారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బండారు దత్తాత్రేయ జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం అని అన్నారు. దత్తాత్రేయను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారన్నారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనియాడారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఆయనది పేరుకు హిందుత్వం, మతం భారతీయం అని చెప్పారు.

Next Story