తెలంగాణలోని ఆ మంత్రిత్వ శాఖకు వెంకయ్య నాయుడు ప్రశంస

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-15 13:39:08  IST  )

తెలంగాణలోని ఆ మంత్రిత్వ శాఖకు వెంకయ్య నాయుడు ప్రశంస

తెలంగాణలోని ఆ మంత్రిత్వ శాఖకు వెంకయ్య నాయుడు ప్రశంస
X

దిశ, వెబ్‌డెస్క్: అశేష ప్రజానీకపు విశేష అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ గాయకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(S. P. Balasubrahmanyam) కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, వారిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో సోమవారం ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖను అభినందించారు.

బాల సుబ్రహ్మణ్యం కేవలం స్వర సార్వభౌముడు మాత్రమే కాదు, ఆయన సంస్కారవంతుడు, నిరాడంబరుడు. ఆయన గాత్రంలో నవరసాలు నాట్యం చేసేవి. డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా, మార్గదర్శిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. ఆయన ఆలపించిన ప్రతి పాటా, ప్రతీ రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యం చేసేవి. ఎంతో మంది నటుల నటనాశైలికి, హావభావాలకు, గాత్రధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత వారికి మాత్రమే సొంతం. ఆయన గళం... సంగీత దర్శకుడు,గేయ రచయిత ఏది కోరుకుంటే అది పలికించే ఒక అక్షయపాత్ర అని కొనియాడారు.

బాలసుబ్రమణ్యంలో ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడున్నారు. పాడుతా తీయగా వంటి కార్యక్రమాల్లో చిన్నారులను ఆయన ప్రోత్సహించిన తీరు, వారికి జీవిత సత్యాలను బోధించే తీరు అద్భుతం. పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు వారు ప్రయత్నించారు. చిన్నారులకు ఆయన చూపిన మార్గదర్శనం, పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం నేటి తరానికి ఆదర్శం. మన భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Next Story