- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ చేతుల మీదుగా వనమహోత్సవం.. గుర్రంగూడ పార్కులో ప్రారంభోత్సవానికి సన్నాహాలు
రాష్ట్రంలో ఈ ఏడాది వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అటవీ శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈ ఏడాది వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అటవీ శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ తో కలిసి గుర్రంగూడ పార్క్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఉన్నతాధికారులు గుర్రంగూడ పార్కును సందర్శించి చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వేదిక ఏర్పాటు, మొక్కల నాటకం, పార్కింగ్, భద్రత, తాగునీరు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
లక్ష్యం 16.06కోట్ల మొక్కలు..
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 6.18 కోట్ల మొక్కలు, హెచ్‌ఎండీఏ పరిధిలో 4.50 కోట్ల మొక్కలు నాటనున్నారు. అటవీ శాఖ 89.59 లక్షల మొక్కల పెంపకం, నాటకం చేపట్టనుంది. ఆయా ప్రభుత్వ శాఖలు సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నాయి. వర్షాకాలాన్ని అనుకూలంగా వినియోగించుకుని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాలు, రహదారుల వెంట విస్తృత స్థాయిలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించారు. నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.






