- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రైతులకు నష్టం జరగకుండా చూడండి
సెంట్రల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులకు ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి

దిశ, తెలంగాణ బ్యూరో: బీదర్ - మహేశ్వరం 765 కెవి విద్యుత్ లైన్ కారణంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన రైతులకు నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సెంట్రల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులను కోరారు. బీదర్-మహేశ్వరం (బేగరకంచ) 765 కెవి హై టెన్షన్ విద్యుత్ లైన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నది. ఈ లైన్ వల్ల విలువైన తమ భూములు కోల్పోవాల్సి వస్తున్నదని, పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని, దీన్ని నివారించాలని రైతులు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి ఎంపీ రవిచంద్రను సంప్రదించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకుపోగా ఆయన సూచన మేరకు బాధిత రైతులతో కలిసి గత నెల 3న ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఖట్టర్‌కు వినతిపత్రమిచ్చారు. రైతులకు నష్టం జరగకుండా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి ఖట్టర్ వెంటనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు కార్పొరేషన్ సీజీఎం బిపిన్ బీహారీ రథ్, సీనియర్ కన్సెల్టెంట్ అశోక్, డీజీఎం సంతోష్ తదితరులు ఆదివారం ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డితోపాటు రైతులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర క్యాంప్ కార్యాలయంలో సుమారు 3గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో విద్యుత్ లైన్ మ్యాపులను అధికారులకు చూపిస్తూ పలు సూచనలు చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అన్యాయం జరుగకుండా చూస్తానని సీజీఎం బిపిన్ బీహారీ రథ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ గంపా వెంకటేశ్, రైతులు పాల్గొన్నారు.






