కేంద్రంపై వీహెచ్ గర్జన: 'కులగణన లేకపోతే బీసీలు బిచ్చమెత్తుకోవాల్సిందే'

by Gantepaka Srikanth |

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వీహెచ్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేంద్రంపై వీహెచ్ గర్జన: కులగణన లేకపోతే బీసీలు బిచ్చమెత్తుకోవాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వీహెచ్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో జనగణన మొదలైనప్పటికీ, అందులో అత్యంత కీలకమైన 'కులగణన' అంశాన్ని విస్మరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన జరగకపోతే వెనుకబడిన తరగతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. బీసీ సమాజానికి దిశానిర్దేశం చేశారు. "కేంద్రం జనగణన మొదలుపెట్టింది కానీ, అందులో కులాల ప్రస్తావన లేదు. మన జనాభా ఎంతో తెలియకుండా మనకు రావాల్సిన వాటా ఎలా వస్తుంది? ఇప్పుడు గనుక మనం కొట్లాడకపోతే, భవిష్యత్తులో బీసీలు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీసీల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఐకమత్యం వచ్చిందని, ఇదే స్ఫూర్తితో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

మోడీ, అమిత్ షాలే మన శత్రువులు..

బీసీల హక్కులను కాలరాస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని వీహెచ్ ఘాటుగా విమర్శించారు. "బీసీల అభివృద్ధికి అడ్డుపడుతున్న మన అసలు శత్రువులు ప్రధాని మోడీ, అమిత్ షా. వారిని ఎదురించడానికి బీసీలంతా ఒక్కటి కావాలి. కులగణన జరిగే వరకు మన పోరాటం ఆగకూడదు" అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన దిశగా అడుగులు వేస్తుంటే, కేంద్రం మాత్రం దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయడానికి వెనకాడుతోందని ఆయన మండిపడ్డారు.

Next Story