ఇంకా ఎన్ని రోజులు మేం అడుక్కు తినాలి: వీహెచ్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇంకా ఎన్ని రోజులు మేం అడుక్కు తినాలి: వీహెచ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ (RSS) అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు చేయడమే ఆర్ఎస్ఎస్ అసలు ఉద్దేశమని ఆయన ఆరోపించారు. బీసీల ప్రయోజనాలపై ప్రధాని మోడీని సూటిగా ప్రశ్నించిన వీహెచ్, అధికారంలో వాటా గురించి నిలదీశారు. "బీసీలు కేవలం ఓట్లు వేయడానికే తప్ప, అధికారం చేపట్టడానికి పనికిరారా?" అని ఆయన ప్రశ్నించారు. తమ హక్కుల కోసం ఎన్నాళ్లు అడుక్కుతినాలని, జనాభా ప్రాతిపదికన బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఆయన కదలికలన్నీ నాగ్‌పూర్ నుంచే శాసించబడుతున్నాయని వీహెచ్ వ్యాఖ్యానించారు. "ప్రధాని మోడీ రిమోట్ కంట్రోల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దగ్గర ఉంది. దేశాన్ని విభజించడమే వారి ఆలోచన. మోడీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తాను" అని సంచలన ప్రకటన చేశారు.

కులగణనపై పట్టు..

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన (Caste Census) కూడా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే బీసీలకు ఏ మేరకు అన్యాయం జరుగుతుందో బయటపడుతుందన్నారు. కులగణన జరగకపోతే బీసీల అభ్యున్నతి సాధ్యం కాదని, దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. బీసీల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని, బీజేపీ పతనం బీసీల చేతుల్లోనే మొదలవుతుందని వీహెచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Next Story