- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ చారిత్రక తప్పిదంతోనే ఈ దుర్గతి: మంత్రి ఉత్తమ్
బీఆర్ఎస్ పార్టీ కృష్ణా బేసిన జలద్రోహి అని.. పాలమూరు ప్రజలకు కేసీఆర్ మరణశాసనం రాశారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ కృష్ణా బేసిన జలద్రోహి అని.. పాలమూరు ప్రజలకు కేసీఆర్ మరణశాసనం రాశారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీలో ఆయన కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.7.469.38 కోట్లు ఖర్చు పెడితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవన్నారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిలాసాగర్ లిఫ్ట్ స్కీములు పూర్తయితే 8.65 లక్షల ఎకరాలకు నీరు అందేదని తెలిపారు. కానీ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.1.87 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల పేరిట ఖర్చు చేసినప్పటికీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు మొండి చేయి చూపారని ఆరోపించారు. బీఆర్ఎన్ పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 11 శాతం వడ్డీ రేటుకు అప్పులు తీసుకొస్తే.. తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంతో ఇరిగేషన్ శాఖకు కేటాయించిన రూ.24 వేల కోట్లతో రూ.10 వేలకోట్లు వడ్డీల కిందనే సరిపోయాయని గుర్తుచేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అప్పుల వడ్డీ లేటును7 శాతానికి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించిందని వెల్లడించారు.
కాళేశ్వరంపై మోజుతో పాలమూరుపై నిర్లక్ష్యం
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న మోజుతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పచేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.90వేల కోట్లు వెచ్చిస్తే.. పామూరు-రంగారెడ్డిపై కేవలం రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ 2017లో నిర్వహిస్తే, పాలమూరుకు 2021లో నిర్వహించారని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ హియరింగ్‌ను కేసీఆర్ క్యాన్సిల్ చేయడం విడ్డూరమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను హైస్పీడ్‌తో చేపట్టి.. పాలమూరు పనులను స్లో డౌన్ చేశారని అన్నారు. జూరాల వద్దనే పాలమూరు-రంగారెడ్డి సోర్స్ పాయింట్ ఉంటే.. రోజుకు 2.8 టీఎంసీల నీటి లభ్యత ఉండేదని, తద్వారా 25 రోజుల్లో 75 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉండేవని వెల్లడించారు. దాంతో 10 లక్షల ఎకరాలకు నీరు అందేదని చెప్పారు. కేవలం రూ.32 వేల కోట్లతో ప్రాజెక్టు కూడా పూర్తి అయ్యేదన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును తరలించి ఉత్తర తెలంగాణకు అన్యాయం చేసినట్టుగానే పాలమూరును జూరాల నుంచి శ్రీశైలం వద్దకు మార్చి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు తీవ్రమైన అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు జూరాల వద్ద ప్రాజెక్టు ఉంటే స్టోరేజ్ కేపాసిటీ 121 టీఎంసీలు ఉండేవని, శ్రీశైలం వద్దకు మార్చి 66 టీఎంసీలకు తగ్గించారన్నారు.
పాలమూరు పనులు 30 శాతమే పూర్తి..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పంపు ఆన్ చేసి ఆపేశారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ రూ.26,262 కోట్లు ఖర్చుచేయగా అది మొత్తం అంచనాతో 32 శాతమే అని, అయినా ఇంకా 39 వేల ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని స్పష్టం చేశారు. 2016లో శంకుస్థాపన చేసినప్పుడు మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని కేసీఆర్ ప్రకటించారని, కానీ ఇప్పటికీ కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. కేసీఆర్ కుర్చీ వేసుకుని ప్రాజెక్టు కట్టిస్తానని చెప్పారని, కానీ ఆ కుర్చీ ఏడ పోయిందో, ఆయన ఎటుపోయారో తెలియదని ఎద్దేవా చేశారు. ఆయకట్టు కాలువల పనులు, భూసేకరణ లేకుండా రూ.55 వేల కోట్లతో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించారని, కానీ.. ప్రస్తుత అంచనాల మేరకు ఈ ప్రాజెక్టు పూర్తికావాలంటే రూ.84 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ఏపీ దోచుకుంటున్నా బీఆర్ఎస్ సైలెంట్..
జూరాల నుంచి 22 పంపులతో 414 మీటర్ లిఫ్ట్ చేయాల్సి ఉండగా, శ్రీశైలం నుంచి 37 పంపులతో 260 మీటర్ల ఎత్తు లిఫ్ట్ చేయాల్సి ఉంటుందని ఉత్తమ్ తెలిపారు. 2014కు ముందు కృష్ణా బ్యాక్ వాటర్ నుంచి ఏపీ ఆక్రమంగా రోజుకు 4.47 టీఎంసీలు తరలించగా, పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏపీ అక్రమంగా తరలించుకునే సామర్థ్యాన్ని 13 టీఎంసీలకు పెంచుకున్నారని వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 3 టీఎంసీలను ఏపీ దోచుకునేందుకు ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నిశ్శబ్దంగా ఉందని చెప్పారు. తాము వచ్చాక ఏపీ, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు పనులు నిలిపివేయించామన్నారు. గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణా జలాల నుంచి 266 టీఎంసీలను 2024-25 సంవత్సరంలో తెలంగాణ వినియోగించినట్టు గజాంకాలు చెబుతున్నాయని వెల్లడించారు. 2004-14 వరకు కృష్ణా జలాల నుంచి ఏపీ 730 టీఎంసీలు అక్రమంగా తరలించుకుపోగా, 2014-24 వరకు 11,900 టీఎంసీలు తరలించిందని, దీని ఆధారంగా గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అర్థమవుతున్నదన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటరీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 13 టీఎంసీలు తరలించేందుకు కుట్ర చేశారని.. బీఆర్ఎస్‌కు తెలిసే కాలువల వెడల్పు పనులు జరిగాయన్నారు.
బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే ముందుకు..
గత ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వథకానికి (పీఆర్ఎన్ఐఎన్)కు హైడ్రాలజీ క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ లేదని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. 90 టీఎంసీల్లో 45 టీఎంసీలు గోదావరి నీటి మళ్లింపు, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్ కోసమని గత ప్రభుత్వం చెప్పినట్టుగానే తాము కూడా ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. 90 టీఎంసీలతో పీఆర్ఎసీని ముందుకు తీసుకెళ్తామని, ఎవరెన్ని అవాస్తవాలు చెప్పినా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్ పేరుతో సుప్రీంకోర్టులో చెప్పి ప్రారంభించిందని అన్నారు. 2022లో బీఆర్ఎన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తాము కూడా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. 90 టీఎంసీలో కనీసం ప్రస్తుతం మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్‌కు సంబంధించిన 45 టీఎంసీలు అయినా ఇవ్వాలని లేఖ రాస్తే దానిని బీఆర్ఎస్ నాయకులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేస్తం..
బీఆర్ఎన్ పదేళ్ల పాలనలో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు కేవలం రూ.41 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి వెల్లడించారు. దీంతోపాటు కాళేశ్వరం వద్ద రోజుకు లిఫ్ట్ చేసే సామర్థ్యాన్ని 2 టీఎంసీల 3 టీఎంసీలకు పెంచారని, పాలమూరు-రంగారెడ్డి వద్ద 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి తగ్గించి కుట్రచేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల కోసం పెంచిన రూ.27 వేల కోట్లను పాలమూరుపై ఖర్చు పెడితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నీరు పుష్కలంగా పారేవని స్పష్టం చేశారు. మూడేళ్లలో 90 టీఎంసీల లక్ష్యంతోనే ఒరిజినల్ షేప్‌తో పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేస్తామన్నారు. అలాగే.. కృష్ణా బేసినల్‌లోని అన్ని ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఈ టర్మ్‌లోనే పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. తాము వచ్చాక ఈ ప్రాజెక్టుపై రూ.7వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. డిండి ప్రాజెక్టుకు రూ.1800 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు ప్రారంభం అయ్యాయని.. వాటినీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని చెప్పారు.
763 టీఎంసీలు కావాలని వాదిస్తున్నాం..
కృష్ణా నదీ జలాల్లో 73 శాతం తెలంగాణకే కేటాయించాలని తాము సమర్థవంతంగా ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 299 టీఎంసీలకే ఒప్పుకొని రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని అన్నారు. ఇంకా ఇప్పుడు తమపై అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎన్ నాయకులు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. ఆనాడు కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా నోచుకుపోతుంటే బీఆర్ఎన్ నోరు మెదపలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే 555 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ ముందు కొట్లాడుతున్నామని స్పష్టం చేశారు. అయితే.. అలకేషన్ వాటర్ కాకుండా డిపెండబులిటీ తదితరాలను కలిపితే కృష్ణాలో 811 కాకుండా 1,050 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని ట్రిబ్యునల్ చెబుతున్నదని.. దాని ప్రకారం అయితే 763 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని వాదనలు వినిపిస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో 71 శాతం నీటిని తమకు కేటాయించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఏడాదిలోపే ఫైనల్ తీర్పు రాబోతున్నదని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల జల వివాదాలకు ఫుల్ స్టాప్ పడే సమయం రానే వచ్చిందన్నారు. కృష్ణా జలాల్లో నుంచి రాష్ట్రాల వినియోగం లెక్కించే టెలిమెట్రీ వ్యవస్థను కూడా గత ప్రభుత్వం పెట్టకుండా తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఆనాడు ఏపీకి మేలు చేసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డితో ప్రజాభవన్ వేదికగా కేసీఆర్ సమావేశాలు నిర్వహించారని ఆరోపించారు. గోదావరి జలాలను తీసుకెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లనే రాయసీమ లిఫ్ట్ పనులు ఆగిపోయాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నిర్వాకంతో చివరకు అలకేషన్ నీటిని కూడా వాడలేని పరిస్థితి నెలకొందన్నారు.
నల్లమలసాగర్‌పై అసత్య ప్రచారం
మరోవైపు.. పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్‌పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. హరీశ్‌రావు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ పర్మిషన్ లేదని.. డీపీఆర్ అనుమతులు రాలేదని.. ఇంకా ఏ పర్మిషన్లు సైతం ఇవ్వలేదని చెప్పారు. అయినా.. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని, రిట్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. ఈ నెల 5వ తేదీన హియరింగ్ ఉందన్నారు. ఇరు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం కమిటీ వేసిందని.. మీరు మీరు కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించిందని తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. అంతేకానీ ఒక్క చుక్క నీటిని వదులుకోబోమని చెప్పారు. నీళ్ల మీదే బీఆర్ఎస్ పార్టీనే సవాల్ చేసి నేడు వారే సభలో లేకపోవడం దురదృష్టకరమన్నారు.






