- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ అవతరిస్తున్నారు
దేశ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో, వారి సమస్యలకు పరిష్కారాలు చూపడంలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో, వారి సమస్యలకు పరిష్కారాలు చూపడంలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెరుగుతున్న నిరుద్యోగం, వరుసగా జరుగుతున్న పరీక్షల పేపర్ లీకులు, విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి, అవకాశాల కొరత ఇవన్నీ దేశ యువతలో తీవ్ర నిరాశను కలిగించాయన్నారు. ఈ పరిస్థితుల్లో యువతతో బీజేపీ ప్రభుత్వానికి పెరుగుతున్న దూరం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యువత, విద్యార్థులు తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేపడితే, వారి ఆవేదనను వినాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై అణచివేతకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని ఆయన విమర్శించారు.
ప్రశ్నించే గొంతులను అరెస్టులతో, బెదిరింపులతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భారత రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువతకు అండగా నిలుస్తూ అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, విద్యార్థుల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి తరఫున నిర్భయంగా గళమెత్తడం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాజీపడని పోరాటం చేయడం ఆయన నాయకత్వంలోని గొప్పతనమని ఆయన కొనియాడారు. రాహుల్ గాంధీ రాజకీయాలు విద్వేషం, విభజనలపై కాదని, ప్రేమ, న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఉన్నాయన్నారు. దేశ యువత, మేధావులు, మధ్యతరగతి, సామాన్య ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందని, ఆయన కేవలం ప్రతిపక్ష నాయకుడిగానే కాకుండా, దేశానికి ప్రత్యామ్నాయ నాయకునిగా అవతరిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, యువత ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తోందన్నారు. దేశ యువత భయపడవద్దని, మీ హక్కుల కోసం, భవిష్యత్తు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగండని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. యువత ఆకాంక్షలకు ప్రతిబింబంగా, ప్రజాస్వామ్య భారత నిర్మాణానికి నాయకత్వం వహించే ప్రత్యామ్నాయ నాయకునిగా రాహుల్ గాంధీ ఎదుగుతున్నారని, ఈ మార్పును దేశ ప్రజలు హర్షిస్తున్నారని, రానున్న రోజుల్లో ఈ విశ్వాసం మరింత బలపడుతుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.






