దద్దమ్మ ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు: ఉత్తమ్

by Gantepaka Srikanth |

దద్దమ్మ ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు: ఉత్తమ్

దద్దమ్మ ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు: ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఇరిగేషన్‌ను సర్వనాశనం చేసిందే కేసీఆర్ అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి సెక్రెటేరియట్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ముందు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి.. ఇరిగేషన్ గురించి మాట్లాడాలని సూచించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఇరిగేషన్ విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. అందరినీ తాకట్టుపెట్టి లక్ష కోట్ల అప్పు తెచ్చి వడ్డీ భారం మోపారన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు తెచ్చారని ఆరోపించారు.

కమీషన్ల కక్కుర్తికి కూలిన కాళేశ్వరం

తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గుండెకాయ అని చెబుతుంటారని.. కానీ, ఆ బ్యారేజీ కూలిపోయిందని.. ఆ బ్యారేజీ కూలిపోవడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని సుప్రీంకోర్టు జడ్జి రిపోర్టు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అయినా ఇరిగేషన్ మీద ఎలా మాట్లాడుతున్నారో వారికే తెలియాలన్నారు. కమీషన్ల కక్కుర్తి, అవగాహన లేక.. అమర్థతత, చాతగానితనం, లేదంటే దద్దమ్మలై రూ.1,81,000 కోట్లు ఖర్చు పెట్టి.. ఈ రాష్ట్రానికి, రైతులకు చేసిన ప్రయోజనం శూన్యమన్నారు. ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా కేసీఆరే వ్యవహరించారని.. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్లను చేపడితే.. కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టును ఆగమాగం చేశారని ఆరోపించారు. లక్ష ఎకరాలకు కొత్త ఆయకట్టుకు కూడా నీరివ్వలేదని ఆరోపించారు. రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ రుద్రమ కోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను కొనసాగించకుండా సీతారాంసాగర్‌ను తీసుకొచ్చారని.. ఆ రెండు స్కీములను కొనసాగిస్తే రూ.1,555 కోట్లతోనే 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేదన్నారు. దానిని తప్పించి రూ.18వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టును నిర్మించారని.. సీతమ్మ ప్రాజెక్టును కలిపితే రూ.25వేల కోట్లు దాటుతుందని చెప్పారు. ఏళ్లుగా దేవాదుల ప్రాజెక్టు ప్రోగ్రెస్‌లో ఉన్నా.. పదేళ్ల అధికారంలో దానిని పూర్తిచేయలేకపోయారన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిలసాగర్ ఎందుకు పూర్తిచేయలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు. ఏడాదిన్నరలో పూర్తిచేస్తామన్న ప్రాజెక్టులను ఒక్కటి కూడా పనిచేయలేదని.. తాము వాటిని పూర్తిచేసే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు.

పాలమూరు-రంగారెడ్డిపై అబద్ధాలు..

పాలమూరు-రంగారెడ్డి విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పడం తగదని ఉత్తమ్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి మీద రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరం ఆయకట్టు ఇవ్వలేదన్నారు. సీతారామసాగర్‌కు రూ.8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు ఇవ్వలేదన్నారు. లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయిందన్నారు. ఇదీ ఇరిగేషన్‌లో బీఆర్ఎస్ సాధించిన స్టోరీ అని ఎద్దేవా చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు-రంగారెడ్డికి 90 టీఎంసీలకు జీవో ఇచ్చారని.. ఆ తరువాత జూరాలకు సైతం జీవో ఇచ్చారని చెప్పారు. తాము 45 టీఎంసీలు తగ్గించి కేంద్రానికి రాశామని చెప్పడం అబద్ధమన్నారు. మొదటి విడతలో మైనర్ ఇరిగేషన్ 45 టీఎంసీలకు సేవింగ్స్ ఇవ్వాలని.. మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ కోసం లేఖ రాసిన విషయాన్ని వెల్లడించారు. ఏనాడూ 90 టీఎంసీల కంటే తక్కువగా పాలమూరుకు తాము అడగలేదన్నారు. వాళ్ల హయాంలోనే రివైజ్డ్ ఎస్టిమేషన్ కింద పాలమూరు-రంగారెడ్డికి రూ.55వేల కోట్లు అవుతాయని అంచనా వేయగా.. రూ.27వేల కోట్లు ఖర్చు పెట్టారని.. ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరివ్వలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పాలమూరు-రంగారెడ్డి మీద రూ.7వేల కోట్లు ఖర్చు పెట్టామని.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిగితా ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ ఏప్రిల్ 12, 2023లోనే కేంద్రం రిటర్న్ పంపిందని.. అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ ఉన్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ లాగా మోసం చేసే అలవాటు తమకు లేదన్నారు. వీళ్లు ముట్టుకోని నార్లపూర్, ఏదుల లింక్ కెనాల్‌ పనులను మూడు నెలల్లోనే పూర్తిచేయబోతున్నామని వెల్లడించారు.

కృష్ణా జలాలపై మాకు చిత్తశుద్ధి

కృష్ణా జలాలు రక్షించడంలో తాము సమర్థవంతంగా ముందుకు పోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో సీఎంగా కేసీఆర్ ఆంధ్రాకు 512 టీఎంసీలు ఇవ్వాలని.. తెలంగాణ 299 సరిపోతాయని అపెక్స్ కౌన్సెలింగ్ మీటింగులో ఒప్పుకున్నారా? లేదా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ రికార్డులన్నింటినీ తాము బయటపెడుతామన్నారు. పాలమూరు, నల్లగొండ జిల్లాకు మోసం చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలన్నింటినీ నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని.. కృష్ణా జలాలతో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ట్రిబ్యునల్‌లో మీకన్న సమర్థవంతంగా కృష్ణా జలాలపై కొట్లాడుతున్నామని.. తాను స్వయంగా ట్రిబ్యునల్‌కు హాజరయ్యానని చెప్పారు.

జగన్‌, కేసీఆర్ కుమ్మక్కుతో రాష్ట్రానికి ద్రోహం

2014 కంటే ముందు కేసీఆర్ సీఎం కాకముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఏపీ రోజుకు 47వేల క్యూసెక్కులు అక్రమంగా తరలించుకుపోతే.. కేసీఆర్ హయాంలో 1,11,400 క్యూసెక్కులకు పెరిగిందని మంత్రి ఆరోపించారు. కేసీఆర్ అసమర్థత వల్ల ప్రతీరోజూ 9.6 టీఎంసీలకు చేరుకుందన్నారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణ ద్రోహం చేశారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు కేసీఆర్ దోహదపడ్డారని.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను ఆపించామని చెప్పారు. శ్రీశైలం బాటమ్ నుంచి రోజూ 3 టీఎంసీలను తరలించుకుపోయే ప్లాన్ జగన్ చేశారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 2004-2014 వరకు 727 టీఎంసీల నీటిని అక్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అక్రమంగా తరలించుకుపోతే.. కేసీఆర్ పదేళ్ల కాలంలో 1,442 టీఎంసీలు ఏపీ తరలించుకుపోయిందన్నారు. కృష్ణా నదీ జలాల్లో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా తాము పోరాడుతున్నామని.. పోలవరం-బనకచర్ల మీద పోరాడింది తాము అని చెప్పారు. కేంద్రంతో, సుప్రీంకోర్టుతో పోరాడుతున్నామని.. పోలవరం-నల్లమలసాగర్ మీద రిట్ పిటిషన్ వేశామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు నీరిచ్చే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పది వేల కోట్లు ఖర్చు పెట్టిన తరువాత ఎందుకు మార్చారు? ఇప్పుడు రంగారెడ్డి మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు? అని ప్రశ్నించారు.

ఎవరు దద్దమ్మలో ప్రజలే నిర్ణయిస్తారు

రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు క్యాన్సిల్ చేశారని.. ఎవరు దద్దమ్మలో ప్రజలే నిర్ణయిస్తారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్ష కోట్లు వృథా చేయకుంటే.. రూ.38వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల పూర్తిచేసుంటే రూ.62వేల కోట్లు మిగిలేవన్నారు. ఆ మిగిలిన డబ్బులతో పాలమూరు-రంగారెడ్డి, కోయిలసాగర్, నెట్టెంపాడు, బీమా, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, దేవాదుల ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తయ్యేవని.. వీటన్నింటికీ కలిపి రూ.4,500 కోట్లు మాత్రమే అయ్యేవని తెలిపారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేదన్నారు. ఎస్ఎల్‌బీసీ, డిండి, నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాను సైతం ఏడిదిన్నర రెండేళ్లలో వీటన్నింటినీ పూర్తిచేస్తామని, 16 లక్షల ఎకరాలకు నీరిస్తామని హామీ ఇచ్చారు.

11 శాతానికి అప్పులు తెచ్చిన కేసీఆర్

ఇరిగేషన్ కోసం బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.96,108 కోట్లు అని.. 11 శాతం వడ్డీతో తీసుకొచ్చారని మంత్రి ఆరోపించారు. ఏటా 10వేల కోట్లు వడ్డీ అవుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి రూ.88వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అప్పు ఉన్నదని.. ఇప్పటివరకు తాము రెండేండ్లలో 49,317 కోట్లు వడ్డీగా చెల్లించామని చెప్పారు. తాము చెల్లిస్తూ వస్తున్నా ఇంకా రూ.56వేల కోట్ల అప్పు మిగిలి ఉన్నదన్నారు. ఆ లోన్లను రీ స్ట్రక్చర్ చేసి 7 శాతానికి తీసుకొచ్చామని.. 11 శాతానికి అప్పులు తెస్తే.. వాటికి ఏటా రూ.16వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రజలు కేసీఆర్ మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. రేవంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి చిత్తశుద్ధితో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ఉద్యమిస్తా, సభలు పెడుతానంటే జనం ఛీ కొడుతారని హెచ్చరించారు.

Next Story