ఎత్తిపోతల పథకాల పనులపై మంత్రి ఉత్తమ్ అసంతృప్తి

by Bhanu |

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు వద్ద నిర్మాణంలో ఉన్న ముక్త్యాల బ్రాంచ్ ఎత్తిపోతల పథకం పనులపై నీటి పారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎత్తిపోతల పథకాల పనులపై మంత్రి ఉత్తమ్ అసంతృప్తి
X

దిశ, చింతలపాలెం: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు వద్ద నిర్మాణంలో ఉన్న ముక్త్యాల బ్రాంచ్ ఎత్తిపోతల పథకం పనులపై నీటి పారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్‌తో కలిసి పర్యటించిన మంత్రి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖలతో పాటు ఎంబీసీ కెనాల్ కాంట్రాక్టర్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల భూముల స్వాధీనం లోపాలు, నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం ఉన్నట్లు పేర్కొన్నారు. సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను గట్టిగా ఆదేశించారు.


రూ. 1450 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ముక్త్యాల బ్రాంచ్ ఎత్తిపోతల పథకం ద్వారా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 53,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇది భవిష్యత్ తరాలకు అత్యంత ఉపయోగకరమవుతుందని మంత్రి తెలిపారు.అనంతరం రూ. 37.70 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న నక్కగూడెం ఎత్తిపోతల పథకం (3,200 ఎకరాల ఆయకట్టు), రూ. 394.10 కోట్లతో నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం (14,100 ఎకరాల ఆయకట్టు) పనులను కూడా మంత్రి పరిశీలించారు.భూ నిర్వాసితుల విషయంలో సానుకూలంగా స్పందిస్తున్న ప్రభుత్వం, మొట్టమొదటిసారిగా ఎత్తిపోతల పథకాల్లో నష్టపరిహారం చెల్లింపును వేగవంతం చేస్తోందని అన్నారు.

పైపులైన్ వేసిన తరువాత రైతులు మళ్లీ ఆ భూముల్లో సాగు చేసుకునే వీలుంటుందని వివరించారు.హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చే లక్ష్యంతో అహర్నిశలు కృషి చేస్తున్నాను. అభివృద్ధే నా ధ్యేయం” అని మంత్రి ఉత్తమ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఆర్డిఓ శ్రీనివాసులు, తహసిల్దార్ సురేందర్ రెడ్డి, సీఐ రజిత రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరాల కొండారెడ్డి, నందిరెడ్డి ఇంద్రారెడ్డి, మోర్తల సీతారెడ్డి, దేవిరెడ్డి లక్ష్మారెడ్డి, రౌతు అంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story