- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పనికిరాని రిపోర్టే ప్రామాణికమట.. ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం
ఎన్డీఎస్ఏ (NDSA) ఇచ్చిన పనికిరాని రిపోర్టును పట్టుకుని అదే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీఎస్ఏ (NDSA) ఇచ్చిన పనికిరాని రిపోర్టును పట్టుకుని అదే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)పై ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన రిపోర్టు అంతా బుటకమని ఇవాళ ఆయన ‘x’ వేదికగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిందని.. కనీస పరీక్షలు నిర్వహించకుండనే NDSA ఎలా రిపోర్టు ఇచ్చిందని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ (Congress) సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదని అన్నారు.
నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకు రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతన లేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని అన్నారు. కేసీఆర్ (KCR)కు మంచి పేరు వస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికే సీఎం నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆక్షేపించారు.
నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెర తీశారని ఆరోపించారు. ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ (L&T) అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పులతడక అని తేలిన నేపథ్యంలో.. దానిని ఓ కుంటిసాకుగా చూపి దాటేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇకనైనా పోలవరం (Polavaram) తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని హితవు పలికారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి సీఎంతో పాటు కాంగ్రెస్-బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.. జై కిసాన్, జై కాళేశ్వరం, జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.






