నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-12-07 16:01:55  IST  )

వరి వేస్తే ఉరి అంటూ ప్రచారం చేసిన నాయకులు బోనస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మండిపడ్డారు.

నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వరి వేస్తే ఉరి అంటూ ప్రచారం చేసిన నాయకులు బోనస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మండిపడ్డారు. లక్ష రుణమాఫీ చేయడానికే ఆపసోపాలు పడి వాయిదాల పద్దతిలో ఒకసారి, ఆఖరి సంవత్సరంలో సగం మందికి కూడా చేయలేక చేతులేత్తేసిన ఎద్దేవా చేశారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ.. గత పాలన నిర్వాకంతో రైతులలో పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయారని ఉప ఎన్నికల్లో పట్టణ ప్రజల్లో కూడా ఆ పార్టీకి ఉన్న వ్యతిరేకతను చవిచూశారని పేర్కొన్నారు. మళ్ళీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధులను ఓడించాలనే అన్న ప్రకటనలు చూస్తుంటే వారు భ్రమల నుండి బయటకు రాలేదన్నారు. గత రెండు సంవత్సరాలలో లక్ష కోట్లకుపైగా నిధులను రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన రేవంత్​ ప్రభుత్వం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించిన ఘనత మా ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడకుండా రైతుల అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రులను కలవడం, తాను కేంద్రంతో భేటీలు జరపడం, అధికారులు కేంద్ర ఎరువుల శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపడంతో కేంద్రం చివరకు సానుకూలంగా స్పందించి ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా చేసిందని తెలిపారు.

రానున్న రబీ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రతి నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. రబీ సీజన్ కు వాస్తవ ప్రణాళిక 10.40 లక్షల మెట్రిక్ టన్నులు అని, ఖరీఫ్ లో జరిగినట్టుగా రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా రబీ సీజన్ మొదటి 3 నెలల్లో 6 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియాను సరఫరా చేయాలని కోరినట్లు వెల్లడించారు. మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తూ, అందుకు అనుగుణంగా అటు కేంద్రంతో, ఇటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందన్నారు. గత రెండు సంవత్సరాలలో రాష్ట్రం అందిస్తున్న మద్దతుతో తెలంగాణ రైతులు ఆయిల్ పామ్ సాగులో దేశానికే ఆదర్శంగా నిలువగా, వరి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టారు.

గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల :

వ్యవసాయ, ఇతర విభాగాల వారీగా జరుగుతున్న సమన్వయంపై అధికారులతో సమావేశమయ్యారు. సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేసి తగు చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Next Story