- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ లేకపోయినా యూరియా బుక్ చేసుకోవచ్చు.. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
యూరియా బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ పెడుతూ.. బటన్ నొక్కితే చాలు యూరియా బుక్ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం టోల్-ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్మార్ట్‌ఫోన్లు లేని, చదువుకోని యాప్ వినియోగంపై అవగాహన లేని రైతుల కోసం ప్రభుత్వం టోల్-ఫ్రీ నంబర్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని చెప్పారు. రైతులు టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే వారి తరపున యూరియా బుకింగ్ ప్రక్రియను సిబ్బంది పూర్తి చేస్తారని వివరించారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని ఫెర్టిలైజర్ యాప్, టోల్-ఫ్రీ సేవలు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు యూరియా పంపిణీని సులభతరం చేయడానికి ఫెర్టిలైజర్ యాప్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని రిటైల్ దుకాణాల్లో 22.67 లక్షల బస్తాలు, సహకార సంఘాల వద్ద 5.56 లక్షల బస్తాలు, మార్క్‌ఫెడ్ వద్ద 59.56 లక్షల బస్తాలు, గోడౌన్లలో 3.56 లక్షల బస్తాలు కలిపి మొత్తం 90.22 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్టానికి 4.06 లక్షల మంది రైతులు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారని తెలిపారు. 13.22 లక్షల యూరియా బస్తాలు బుక్ చేయబడగా, వాటిలో 11.18 లక్షల బస్తాలు ఇప్పటికే కొనుగోలు అయ్యాయని, బుక్ చేసిన యూరియాలో 84.6 శాతం రైతులకు అందజేసినట్లు వివరించారు. యూరియా కొనుగోళ్లలో నిజామాబాద్ అగ్రస్థానంలో ఉందని ఈ జిల్లాలో 1,39,121 బస్తాలు, కామారెడ్డి జిల్లాలో 71,742 బస్తాలు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 50,638 బస్తాలు, సంగారెడ్డి జిల్లాలో 34,482 బస్తాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33,485 బస్తాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. డిజిటల్ యాప్ వినియోగంలో నిజామాబాద్ జిల్లా రైతాంగం ఆదర్శంగా నిలిచిందని అభినందించారు.
యూరియా బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లకుండా యాప్ తెచ్చాం..
యూరియా అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, పరిశ్రమలకు మళ్లింపు వంటి దుర్వినియోగాలను అరికట్టడానికే ఈ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. భూమి లేని వ్యక్తులు యూరియా కొనుగోలు చేయకుండా, నిజమైన రైతులకు మాత్రమే ఎరువులు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాల నుంచి సముద్ర మార్గంలో వచ్చే యూరియా సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి అవసరమైన కోటాను సాధిస్తున్నామని తెలిపారు. రైల్వే వ్యాగన్లు, లారీల ద్వారా జిల్లాలకు యూరియాను సకాలంలో తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. గ్రామీణ రైతులకు మరింత చేరువయ్యేలా యాప్‌లో కొన్ని సాంకేతిక మార్పులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా యూరియా యాప్‌ను వినియోగిస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన రైతు తిరుమల గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు వడ్డే ఉమేష్, మంచిర్యాల జిల్లాకు చెందిన రైతులు శ్రీనివాస్, తిప్పని కుమార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు మరియదాస్ తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకున్నారు. గతంలో యూరియా కోసం ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రస్తుతం యాప్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకుని అవసరమైన సమయంలో యూరియాను పొందుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ సంచాలకులు గోపి ఇతర అధికారులు పాల్గొన్నారు.






