రాష్ట్రంలో యూరియా యాప్ గ్రాండ్ సక్సెస్.. 1,15,534 యూరియా బస్తాలు బుకింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-25 05:46:28  IST  )

రైతులకు ఇళ్లలో నుంచే యూరియా బుకింగ్ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన యూరియా మొబైల్ యాప్ విజయవంతంగా సాగుతోంది.

రాష్ట్రంలో యూరియా యాప్ గ్రాండ్ సక్సెస్.. 1,15,534 యూరియా బస్తాలు బుకింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు ఇళ్లలో నుంచే యూరియా బుకింగ్ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన యూరియా మొబైల్ యాప్ విజయవంతంగా సాగుతోంది. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ యాప్ ద్వారా వేలాది మంది రైతులు సులభంగా యూరియా బస్తాలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ యాప్‌ను ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, జనగాం, పెద్దపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ రైతులు యూరియా కోసం కొనుగోలు కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది.

ఇక కేవలం మూడు రోజుల్లోనే యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతుల సంఖ్య 37,264‌కు చేరడం గమనార్హం. ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో 1,15,534 యూరియా బస్తాలను రైతులు మొబైల్ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులు ఇంటి వద్ద నుంచే తమ అవసరానికి అనుగుణంగా యూరియా బుక్ చేసుకునే అవకాశం లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల గుంపులు, క్యూలు, మధ్యవర్తుల జోక్యాలు తగ్గించే దిశగా ఈ యాప్ ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. పైలట్ దశలో వచ్చిన అనుభవాన్ని పరిశీలించి, అవసరమైన సాంకేతిక మార్పులు చేసిన అనంతరం విడతల వారీగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా యూరియా బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. యాప్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత యూరియా సరఫరాలో పారదర్శకత, వేళకు ఎరువుల లభ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read More..

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు.. జిల్లాల్లోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం

Next Story