- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు.. జిల్లాల్లోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం
రాష్ట్రంలో వైద్య సేవల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వైద్య సేవల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు జిల్లా ఆస్పత్రుల నుంచి ఎక్కువశాతం రోగులను హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి టర్టియరీ కేర్ హాస్పిటల్స్‌కు రిఫర్ చేయడం సాధారణంగా మారింది. దీనివల్ల హైదరాబాద్‌పై తీవ్ర భారం పడడమే కాకుండా, పేద రోగులకు ప్రయాణ, వసతి, ఖర్చుల భారం కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటల్స్‌లోనే పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ...
ప్రస్తుతం తెలంగాణలో 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా.. గత ఐదారు ఏళ్లలోనే పెద్ద సంఖ్యలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఏటా 4,240 మంది ఎంబీబీఎస్ వైద్యులు ఈ కళాశాలల నుంచి పట్టభద్రులవుతున్నారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్‌నే జనరల్ హాస్పిటల్స్‌గా ఉపయోగిస్తున్నారు. ఈ ఆస్పత్రుల్లో మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌తో పాటు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ వంటి అనేక స్పెషాలిటీలకు అవసరమైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇప్పటికే ఉన్నారు. సాంకేతికంగా అన్ని రకాల వైద్యం అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ, మౌలిక సదుపాయాల లోపం, ప్రత్యేక పరికరాల కొరత, సిబ్బంది అసమతుల్యత కారణంగా చాలా కేసులు హైదరాబాద్‌కు రిఫర్ అవుతున్నాయి.
హైదరాబాద్‌కు ఎందుకొస్తున్నారు?
జిల్లాల్లో అన్ని విభాగాలకు ప్రొఫెసర్ స్థాయి వైద్యులు అందుబాటులో ఉన్నా.. కేసులను హైదరాబాద్‌కు రెఫర్ చేయడంపై సీఎం రేవంత్ తప్పుపట్టినట్లు సమాచారం. అంత సెటప్ ఉన్నా ఇంకా రోగులు హైదరాబాద్‌కు రావడం ఏంటని ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల్లోనే అత్యవసర, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో క్రిటికల్ కేర్ యూనిట్లు (సీసీయూలు), ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇకపై సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా జిల్లాల్లోనే పూర్తి స్థాయిలో అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకోసం అవసరమైన స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, బయోమెడికల్ సిబ్బందిను తక్షణమే నియమించాలని, అధునాతన వైద్య పరికరాలు, క్యాథ్ ల్యాబ్‌లు, ఎండోస్కోపీ యూనిట్లు, న్యూరో-డయాగ్నస్టిక్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, జిల్లా ఆస్పత్రుల్లో రిఫరల్ ప్రోటోకాల్‌ను కఠినంగా అమలు చేసి, అక్కడ చికిత్స చేయగల కేసులను హైదరాబాద్‌కు పంపకుండా చూడాలని సూచించింది. ఈ చర్యలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల రోగులకు తమ జిల్లాల్లోనే నాణ్యమైన, సమయానుకూల వైద్యం అందనుంది. హైదరాబాద్‌పై పడుతున్న రోగుల భారం తగ్గడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా సమానంగా వైద్య వసతులు విస్తరించే అవకాశం ఉంటుంది. టీచింగ్ హాస్పిటల్స్‌ను కేవలం శిక్షణ కేంద్రాలుగా కాకుండా, పూర్తిస్థాయి టర్టియరీ కేర్ హబ్‌లుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
జిల్లాల్లోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం..
జిల్లాల్లోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు సర్కారు సిద్ధమైంది. ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపరచడం, కొత్త సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాలు అమలు కాగానే నిరుపేదలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఈ చర్యలతో రాష్ట్ర వైద్య వ్యవస్థను మరో మెట్టు ఎక్కించనుంది.






