జీఐఎస్ మ్యాపింగ్‌తో పట్టణ ప్రణాళిక.. నోడల్ ఏజెన్సీగా డీటీసీపీ

by Naga Rani Yarlagadda |

పట్టణాల్లో సంస్కరణలను అమలు చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్-2025-26’(సాస్కీ) కింద రూ.2వేల కోట్లు రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

జీఐఎస్ మ్యాపింగ్‌తో పట్టణ ప్రణాళిక.. నోడల్ ఏజెన్సీగా డీటీసీపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టణాల్లో సంస్కరణలను అమలు చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్-2025-26’(సాస్కీ) కింద రూ.2వేల కోట్లు రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే టౌన్ ప్లానింగ్ స్కీమ్స్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్, ట్రాన్సిట్ ఓరింటెడ్ డెవలప్మెంట్(టీఓడీ), స్పాంజి సిటీల ఏర్పాటు, అర్బన్ ఫారెస్ట్, నీటి వనరుల సంరక్షణ, గ్రీన్ బిల్డింగ్స్ మొదలైనవి అమలుచేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనిని ఫైనల్ చేసే బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ)కి అప్పగించారు.

ఆక్యూపెన్సీ నుంచి అసెస్ మెంట్ వరకు..

బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది వేరు.. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ చేసేదివేరు. రెండు విభాగాల అధికారుల సమన్వయ లోపం కారణంగా ఆదాయం కోల్పోవలసి వస్తున్నదని అధికారులు గుర్తించారు. ఇక నుంచి ఇలాంటి లోపాలకు చెక్ పెట్టాలని అధికారులు నిర్ణయించారు. సాస్కీ ప్రతిపాదనల్లో భాగంగా ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ జారీచేసినప్పటి నుంచే ప్రాపర్టీ టాక్స్ అసెస్ మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం బిల్డింగ్ పర్మిషన్ పోర్టల్, రెవెన్యూ పోర్టల్, రిజిస్ట్రేషన్ పోర్టల్ అన్నింటికీ యూనిఫైడ్ ఐడీ ఇవ్వనున్నారు. దీంతో ఆస్తిపన్ను పెరగడంతో పాటు స్టాంపు డ్యూటీ కూడా పెరిగే అవకాశముంది. అలాగే ప్రాపర్టీని అమ్మడానికి ముందుగానే ప్రాపర్టీ టాక్స్ చెల్లించేందుకు అవకాశముంటుంది. ఫలితంగా రియల్ టైం ల్యాండ్ యూజ్ గుర్తించడంతో పాటు, మార్కెట్ రేటు ఆధారంగా అసెస్ మెంట్ చేయవచ్చు. ఫలితంగా ఆదాయం కూడా పెరగనుంది.

పరిపాలనలో పలు నియామకాలు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో 50 శాతం భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో సంస్కరణలు అమలుచేయాలి. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లను తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంది. దీంతోపాటు అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్బీ)లకు క్లస్టర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముగ్గురు హైడ్రాలజిస్టులను నియమించాల్సి ఉంటుంది.

జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్

అమ్రుత్ నగరాలైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యుఎంసీ), నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహాబుబ్ నగర్, రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లు, ఆదిలాబాద్, సూర్యపేట, నల్గొండ, మిర్యాలగుడ, సిద్దిపేట్ మున్సిపాలిటీల్లో వాటర్, సీవరేజ్, స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీల నెట్ వర్క్ ను జీఐఎస్ ఆధారంగా మ్యాపింగ్ చేయాల్సి ఉంది. దీంతోపాటు ముంబైలో అమలు చేస్తున్న డిజిటల్ ట్విన్ మోడల్ లో రియల్ టైం డేటా ఆధారంగా మ్యాపింగ్ చేయాలని సాస్కీ నిబంధనల్లో పేర్కొన్నారు.

అర్బన్ ల్యాండ్ పూలింగ్ సంస్కరణలు

మున్సిపాలిటీలతోపాటు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల్లోనూ అర్బన్ ల్యాండ్ పూలింగ్ సంస్కరణలను అమలు చేయనున్నారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో మెట్రోరైలు ప్రాజెక్టు మార్గాల్లో ట్రాన్సిట్ ఓరింటెడ్ డవలప్ మెంట్(టీఓడీ) అమలు చేయాలని కసరత్తు చేస్తున్నారు. దీంతో అడ్వర్ టైజ్ మెంట్ ఫీజు, పార్కింగ్ ఫీజు ద్వారా ఆదాయం వచ్చే అవకాశముంది. దీనిలో భాగంగా లోకల్ ఏరియా డెవలప్ మెంట్ ప్లాన్ అమలు చేయడానికి హెచ్ఎండీఏ కస్తరతు చేస్తోంది. ఇందుకోసం కన్సల్టెంట్ నియమించుకునేందుకు టెండర్లు ఆహ్వానించారు.

వాతావరణ మార్పులు సైతం..

ఆదాయం రాబట్టుకునే సంస్కరణలే కాదు.. ప్రజలకు మంచి వాతావరణం కల్పించడంలోనూ సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుంది. పెరుగుతున్న జనాభా ఆధారంగా వాహనాలు పెరగడంతో కాలుష్యం పెరిగి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. దీంతో వీటిని బ్యాలెన్స్ చేయడానికి స్పాంజి సిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చెరువులు, మూసీకి పునరుజ్జీవనం కల్పించే అంశాన్ని కూడా సాస్కీ మార్గదర్శాల్లో చేర్చారు.

నోడల్ ఎజెన్సీగా డీటీసీపీ..

సాస్కీ ప్రతిపాదనలను రూపొందించడంతోపాటు ఫైనల్ చేపే బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) విభాగానికి అప్పగించారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బిల్డింగ్ రూల్స్ ఎలా ఉండాలి? ప్రణాళికబద్ధమైన నగరాలను ఏర్పాటు చేయడానికి కావాల్సిన మాస్టర్ ప్లాన్లు ఎలా ఉండాలి? తదితర అంశాల పరిశీలనకు డీటీసీపీ శ్రీకారం చుట్టింది.

Next Story