సచివాలయంలో ‘చాయ్’పే రగడ.. ఇష్టానుసారంగా బిల్లుల సమర్పణ

by Kema Shiva Kumar |

తెలంగాణ సెక్రటేరియట్‌లో చాయ్ బిల్లుల దుర్వినియోగం కలకలం రేపుతోంది.

సచివాలయంలో ‘చాయ్’పే రగడ.. ఇష్టానుసారంగా బిల్లుల సమర్పణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక వ్యక్తి రోజుకు ఒకటో రెండో చాయ్‌లు తాగడం సహజం. ఒకవేళ పని ఒత్తిడి ఉంటే మరో రెండు అదనంగా తాగుతాడు. కానీ సీఎం సెక్రెటరీలు, సీఎస్ పేషీల్లో పనిచేస్తోన్న అధికారులు,సిబ్బంది అక్కడికి వచ్చే గెస్టులు ప్రతిరోజూ వందలకొద్ది చాయ్‌లు తాగేస్తున్నారట. తాజాగా ఏజెన్సీ సమర్పించిన బిల్లులు చూస్తే ఈ విషయం వెలుగుచూసింది. ప్రతినెలా ఇదే తరహాలో బిల్లులు ఇవ్వడం రోటిన్‌గా మారినట్టు ప్రచారం జరుగుతున్నది.

నెలకు 10 వేల ‘టీ’లా?

చీఫ్ సెక్రెటరీ, సీఎం సెక్రెటరీల్లో పనిచేస్తున్న అధికారులు, స్టాఫ్, వివిధ పనుల కోసం వచ్చే గెస్టులకు ప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్ చాయ్, కాఫీలను సరఫరా చేస్తుంటుంది. ఒక్కో పేషీలో సగటున 10 మంది వరకు పనిచేస్తుంటారు. అక్కడికి రోజుకు 10 నుంచి 15 మంది వరకు గెస్టులు వస్తుంటారు. వారందరూ రెండు సార్లు చొప్పున చాయ్ తాగినా రోజుకు 50 నుంచి 60 వరకు.. ప్రతినెలా సగటున 1500 నుంచి 1600 వరకు టీలు తాగే చాన్స్ ఉంటుంది. కానీ కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లుల్లో మాత్రం ఒక్కో పేషీకి సగటున 5 వేల వరకు (చాయ్, కాఫీ) సరఫరా చేసినట్టు చూపించారు. ‘ప్రతినెలా సీపీఆర్వో ఆఫీసుకు సుమారు 10 వేలు, చీఫ్ సెక్రెటరీ ఆఫీసుకు 8 వేలు, సెక్రెటరీల పేషీలకు 4 నుంచి 5 వేల వరకు చాయ్/కాఫీలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించాం’ అని ఏజెన్సీ ప్రతినెలా సమర్పిస్తోన్న బిల్లులును చూసిన ఓ అధికారి వెల్లడించారు. నిజానికి చీఫ్ సెక్రెటరీ ఆఫీసుకు, సీపీఆర్వో ఆఫీసులకు ఎక్కువ సంఖ్యలో విజిటర్స్ వస్తుంటారు. కానీ ఏజెన్సీ సమర్పించిన బిల్లుల మాదిరిగా రోజుకు రెండు, మూడు వందల మంది విజిటర్స్ వచ్చే అవకాశం లేదని, తక్కువ సరఫరా చేసి ఎక్కువ మొత్తంలో బిల్లులు సమర్పించారేమోనని సదరు అధికారి అనుమానం వ్యక్తం చేశారు.

మొన్న భోజనం బంద్.. చాయ్‌పై ఆరా

ఉమ్మడి రాష్ట్రం నుంచి సీఎం సెక్రెటరీలు, చీఫ్ సెక్రటరీ ఆఫీసుల్లో పనిచేస్తోన్న అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ ఖర్చులతో లంచ్, స్నాక్స్ అందించే సంప్రదాయం కొనసాగుతున్నది. కానీ ఆ సదుపాయం దుర్వినియోగం అవుతుందనే విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు లంచ్, స్నాక్స్ సరఫరాను నిలిపివేశారు. ప్రతిరోజూ అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్లు, స్టాఫ్, వివిధ పనుల కోసం వచ్చే గెస్టులకు చాయ్, కాఫీలను అందిస్తుంటారు. దీనిని ప్రొటోకాల్ డిపార్మెంట్ స్టాఫ్ చూస్తుంటారు. కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతిరోజూ కొనుగోలు చేసే పాలు, షుగర్, టీ, కాఫీ పొడిల బిల్లులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి ఫైనల్ బిల్‌కు ఆమోదం తెలుపుతారు. భోజనాలు, స్నాక్స్ సరఫరాలో దుర్వినియోగం అవుతున్నట్టుగానే చాయ్, కాఫీ సరఫరాలో సైతం ఏమైనా లోపాలు ఉన్నాయోమోనని అధికారులు ఆరా తీయగా అసలు విషయం బహిర్గతమైనట్టు తెలిసింది. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం అవుతుండంతో కాంట్రాక్టు సంస్థ ఎక్కువ బిల్లులను సమర్పించడం రోటిన్‌గా మారిందనే చర్చ కూడా సెక్రెటేరియట్ వర్గాల్లో ఉంది.

రూల్స్ చేంజ్..

ఇప్పటివరకు చాయ్/కాఫీల సరఫరా విషయంలో ఏజెన్సీ నెలకోసారి బిల్లులు సమర్పిస్తుంది. పెద్ద మొత్తంలో చాయ్/కాఫీలు సప్లయ్ చేస్తున్నట్టు బిల్లుల్లో పేర్కొనడంతో మానిటరింగ్ చేయాలని ప్రొటోకాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ప్రతిరోజూ టీ, కాఫీ సప్లయ్ చేసిన తరువాత సంబంధిత పేషీ నుంచి రిజిస్టర్‌లో సంతకాలు చేయించుకోవాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో ఏ పేషీల్లో ఎంత మొత్తంలో చాయ్, కాఫీలు తాగుతారనే విషయం క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.

Next Story