- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అకాల వర్షాలతో అన్నదాతల అరిగోస.. చేతికొచ్చిన పంట నేలపాలు
అన్నదాతలపై వరుసగా ప్రకృతి కన్నెర్ర చేసి కంటనీరు పెట్టిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: అన్నదాతలపై వరుసగా ప్రకృతి కన్నెర్ర చేసి కంటనీరు పెట్టిస్తోంది. మొన్నటి వరకు వరి పంటకు నీరందక భూగర్భజలాలు అడుగంటిపోవడంతో చేతికొచ్చిన పంట పశువుల మేతగా మారింది. ప్రస్తుతం సాగునీరు పుష్కలంగా లభించిన ప్రాంతాల్లో పంట కోసే ముందు అకాల వర్షాలు, ఈదురు గాలులతో ధాన్యం పూర్తిగా నేలపాలైంది. దీంతో అన్నదాతల బతుకు అతలాకుతలంగా మారింది. ఆరుగాలం కష్టించి పనిచేస్తే ప్రకృతి విపత్తులతో వ్యవసాయం కుదేలవుతోంది. ఇన్ని ఇబ్బందుల మధ్య పంట సాగు చేయాలంటే భయపడే రోజులు వచ్చాయి. గ్రామాల్లో వ్యవసాయం చేయడం కంటే పట్టణాలకు వలస వెళ్లి పనిచేసుకోవడం ఉత్తమమనే భావనలో అన్నదాతలు ఉన్నారు. నెల రోజుల కింద భూగర్భ జలాలు అడుగంటి రాష్ట్ర వ్యాప్తంగా 2.50లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోగా, ప్రస్తుతం ఆకాల వర్షాలకు 15,600 ఎకరాల్లో చేతికి వచ్చిన పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.
వరి, మొక్కజోన్న పంటల్లో ఎక్కువ నష్టం..
మార్చి 21 నుండి ఈ నెల 15 వరకు కురిసిన వడగళ్ల వానలతో జరిగిన పంటనష్టంపై వ్యవసాయ శాఖ నివేదికలు తెప్పించింది. దాదాపు 16 జిల్లాల్లోని 78 మండలాల్లో సుమారు 15,600 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. దెబ్బతిన్న పంటల్లో 9500 ఎకరాల్లో వరి, 4900 ఎకరాల్లో మొక్కజొన్న, 380 ఎకరాల్లో మామిడి ఇతర పంటలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. పంటనష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ఏడాదిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటకు ప్రభుత్వం రూ.10వేలు పరిహారం పంపిణీ చేసింది. ఆకాల వర్షాలకు కూడా రూ.12వేలు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. చాలా మంది రైతులకు రైతు భరోసా జమ కాలేదని, కనీసం పరిహారం పెంపుతోనైనా ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు.
వర్షాలకు రంగు మారిన ధాన్యం..
ఇటీవల కురిసిన వానలకు కొన్నిచోట్ల వరి పంట వంగి నేలకు తాకడంతో ధాన్యం రంగులో తేడా వచ్చింది. రైతులు వరికోత యంత్రాలకు ఎక్కువ డబ్బులు చెల్లించి పంట కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లితే నిర్వాహకులు తూకం వేసేందుకు ససేమిరా అంటున్నారు. ధాన్యం పచ్చిగా ఉండడంతో పాటు పూర్తిగా రంగు మారిందని, వీటిని తాము కొనుగోలు చేయలేమని వాపస్ పంపుతున్నారు. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ధర్నాలు చేపడుతున్నారు.
పరిహారం పెంచాలంటున్న అన్నదాతలు
వరి, మొక్కజొన్న పంట వేస్తే ఎకరానికి రూ.23వేల వరకు పెట్టుబడి వస్తోంది. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటకు ప్రభుత్వం ఎకరాకు పరిహారం రూ.20 వేలు చెల్లించాలని రైతు సంఘాలు కోరుతున్నారు. పంట నష్టం లెక్కింపును దెబ్బతిన్న పంటలో 33 శాతం కాకుండా ఎంత మేరకు నష్టం జరిగిందో అంచనా వేసి దాని ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. రెండు సీజన్లకు సంబంధించిన పెట్టుబడి సాయం దక్కలేదని, కనీసం పంట పరిహారమైన పెంచి అప్పుల నుంచి ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






