- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మహిళలపై ఆగని ఆకృత్యాలు
రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. 2020 నుంచి 2025 సెప్టెంబర్ వరకు 51,586 కేసులు నమోదు కాగా..

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. 2020 నుంచి 2025 సెప్టెంబర్ వరకు 51,586 కేసులు నమోదు కాగా, అందులో వరకట్న వేధింపులు, గృహ హింసకు సంబంధించి 498 ఏ సెక్షన్ కింద నమోదైన కేసులే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే నమోదైన కేసుల్లో సగానికి పైగా 26,523 కేసులు ఇంకా విచారణ దశలోనే (పెండింగ్ ట్రయల్) నిలిచిపోయి ఉండడం బాధితులకు న్యాయం జరగడంలో జరుగుతున్న జాప్యాన్ని సూచిస్తున్నది. రాష్ట్రంలో 2020లో 8,077 కేసులు నమోదుకాగా, 2021లోఈ సంఖ్య పదివేలకు పైగా నమోదవడం గమనార్హం. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలను వెలుగులోకి తెచ్చారు. అయితే పెండింగ్ కేసులు పేరుకుపోవడం వల్ల నేరస్తుల్లో చట్టం పట్ల భయం సన్నగిల్లుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలను పటిష్టంగా అమలు చేసినప్పుడే ఈ నేరాల సంఖ్య తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
వరకట్న దాహానికి వందలాది మంది బలి
వరకట్న వేధింపులతోపాటు వరకట్న వేధింపులతో జరుగుతున్న మరణాలు (సెక్షన్ 304-బీ) కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో మొత్తం 604 వరకట్న మరణాలు సంభవించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 2020లో 180 మరణాలు చోటుచేసుకోగా, 2021లో 99 మరణాలు, 2022లో 62 మరణాలు, 2023లో 124 కేసులు, 2024లో 58 కేసులు నమోదు కావడం గమనార్హం. 2025 సెప్టెంబర్ 81 కేసులు నమోదయ్యాయి. కాగా, 2025 సెప్టెంబర్ నాటికి 411 కేసులు విచారణకు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
ఇది ఆందోళన కలిగించే అంశం
-రాజేంద్ర పల్నాటి, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్
రాష్ట్రంలో 2020 జనవరి నుంచి 2025 వరకు నమోదైన వరకట్న కేసులు, వరకట్న మరణాలు, పెండింగ్ కేసుల వివరాలను తెలపాలని డీజీపీ కార్యాలయానికి ఆర్టీఐ ద్వారాదరఖాస్తు చేశాం. తెలంగాణ మహిళా పోలీస్ వింగ్ నుంచి మాకు సమాచారం అందింది. అయితే విడాకులు కేసులకు సంబంధించిన సమాచారం తమ దగ్గరలేదని వారుతెలిపారు. అయితే ఈ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలి.






