సీఎం రేవంత్, కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-09 08:33:43  IST  )

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు.

సీఎం రేవంత్, కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణను తాము నిర్లక్ష్యం చేశామని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు.

2023 జూన్ 7న 'తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర' పేరుతో బాగ్ లింగంపల్లిలోని RTC కళాభవన్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మరోసారి తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ జరిగేవిధంగా సహకరించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కు కేంద్ర మంత్రి లేఖ రాశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సిద్ధంగా ఉన్నామని, అందుకు హైదాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా ఈ ఓపెన్ డిస్కషన్ ఏర్పాటు చేయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి రాసిన లేఖలో కోరారు.

తేదీ, సమయం నిర్ణయించి వారిద్దరిని ఆహ్వానించాలని, వాస్తవాలు ఏమిటో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలిసే విధంగా మీడియా ముందు నిర్మాణాత్మకమైన చర్చకు చొరవ తీసుకోవాలని కోరారు. అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, పద్ధతిగా, పార్లమెంటరీ పద్ధతిలో ఉండాలనే విషయం అర్థం చేసుకుని వ్యక్తిగత, అసహ్యపు మాటలు లేకుండా సానుకూల చర్చ జరిగేలా చూడాలని కిషన్ రెడ్డి కోరారు.

Next Story