- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: గుణపాఠం తప్పదు.. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
తెలంగాణ రైజింగ్ - 2047 డాక్యుమెంట్ను అభినందించిన సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు అమలు తెలుసుకున్నారా అంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైజింగ్ - 2047 డాక్యుమెంట్ను అభినందించిన సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు అమలుపై తెలుసుకున్నారా అంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బహిరంగ లేఖ రాశారు. గ్యారెంటీలు, హామీల అమలు పక్కకు పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2023 లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరై అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారం చేపట్టి రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న స్వయంగా ప్రకటించిన గ్యారెంటీల అమలు గురించి కానీ ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా అంటూ నిలదీశారు.
ఇచ్చిన హామీలు వదిలివేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ, మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్ తో కొత్త పల్లవి అందుకొని ఒకరినొకరు అభినందించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టి, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేలేశారా, గాంధీ భవన్ లో పాతరేశారో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించే ముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఇచ్చిన మాట మీద నిలబడాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే కాంగ్రెస్ప్రయోగించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై మిమ్మల్ని అధికారానికి దూరం చేస్తుందన్నారు. గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని కోరారు. ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిచర్యలకు పాల్పడి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.






