రేవంత్​ రెడ్డి చేతులెత్తేశాడు.. ఇక తెలంగాణకు ఏకైక రక్ష బీజేపీనే: కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

by Ramesh Naini |   (  Updated:2025-06-22 11:41:17  IST  )

అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను నమ్మేవాడు లేడని.. సీఎం రేవంత్​ రెడ్డి చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

రేవంత్​ రెడ్డి చేతులెత్తేశాడు.. ఇక తెలంగాణకు ఏకైక రక్ష బీజేపీనే: కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను నమ్మేవాడు లేడని.. సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ (ఆదివారం) సికింద్రబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఒక కుటుంబం బారినపడి ఏ రకంగా బలి అయ్యామో మనకు తెలుసన్నారు. ధనికరాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్ల అప్పులపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రకంగా.. అవినీతి పాలనతో, దోపిడీ, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారో చూశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్​ఎస్​ పార్టీ ఏ రకంగా పనిచేసిందో మనం చూశామని చెప్పుకొచ్చారు.

కేసీఆర్​‌ను వద్దనుకొని, సోనియా గాంధీ మాటలు నమ్మి.. ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్​ కు ఓటు వేస్తే.. గడిచిన ఏడాదిన్నరలో ప్రజల నమ్మకాన్ని ఎలా వమ్ము చేసిందో చూస్తున్నామని అన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి.. వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. పరిపాలన చేతగాక.. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్​ రాష్ట్రంలో చేతులెత్తేసిందని వెల్లడించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్​, కాంగ్రెస్​, ​కేసీఆర్, రాహుల్​ గాంధీ విఫలమయ్యారని అన్నారు.

ఈ రాష్ట్రంలో నిజంగా తెలంగాణకు మేలు జరగాలంటే.. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. ప్రధాని మోడీ నేతృత్వంలో (BJP) బీజేపీతోనే సాధ్యమన్నారు. వచ్చే శాసనసభలో ఎప్పుడు జరిగినా.. మోడీ నాయకత్వంలో తెలంగాణలో కాషాయజెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏకైక రక్ష బీజేపీ.. మోడీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని సూచించారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా.. ఎంపీగా నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఈటల రాజేందర్​‌ని తెలంగాణ బీజేపీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మీటింగ్ అనంతరం రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని జైన్ భవన్‌లో పది, ఇంటర్, డిగ్రీలో ప్రతిభ చాటిన విద్యార్థులకు నోట్ బుక్స్, మెరిట్‌ స్కాలర్‌షిప్స్ కిషన్ రెడ్డి అందజేశారు.

Next Story