తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు మంజూరు.. బడ్జెట్‌పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉందని, ఉచితాల కోసం ప్రవేశపెడుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు మంజూరు.. బడ్జెట్‌పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉందని, ఉచితాల కోసం ప్రవేశపెడుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బడ్జెట్ ప్రవేశ పెడతారనే ప్రజల ఆలోచనకు, భావనకు భిన్నంగా ఈ బడ్జెట్ రూపొందించామన్నారు. యువతకు, గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు, పరిశోధనలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ఉందన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థిక పరిశోధకులు, మేధావులు, అవగాహన కలిగిన వారి మన్ననలు పొందిన బడ్జెట్ అని, రాష్ట్రాల వారీగా కాకుండా, దేశ అభివృద్ధిని కోసం బడ్జెట్ ఉన్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు సరిపడా నిధులను కేటాయించామని వాటికి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులు అందుతాయి. ఐటీ హబ్, ఎడ్యుకేషనల్ హబ్, డిజిటల్ హబ్, హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్, సెమీ కండక్టర్ హబ్ , డేటా సెంటర్ హబ్, మెడికల్ హబ్, వంటివి వాటితో హబ్స్ ఆఫ్ హబ్ హైదరాబాద్ అవతరించిందని తెలిపారు.

తెలంగాణలో ఉన్న 23 లక్షల ఎంఎస్​ఎంఈలకు ఈ బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అన్నారు. వచ్చే ఐదేళ్ల కోసం రూ.10 వేల కోట్లతో ప్రకటించిన బయో ఫార్మా ద్వారా ఫార్మా కేపిటల్ గా ఉన్న మన హైదరాబాద్ నగరానికి చాలా మేలు జరగనుంది. వీబీ జీ రామ్​ఉపాధి పథకానికి బడ్జెట్​లో 9 శాతం నిధులు కేటాయించామన్నారు. ప్రతి జిల్లాకు ఒక బాలికల వసతి గృహం నిర్మించనున్నట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద తెలంగాణకు 1.3 లక్షల ఇళ్లకు ఇంటికి రూ. లక్షన్నర చొప్పున రూ.2,190 కోట్లు కేటాయించనుంది. తెలంగాణలో దాదాపు 5 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేశామని ఇంకా నుంచి రూ.2,471.76 కోట్ల వ్యయంతో 64 కిలోమీటర్ల పొడవున ఆర్మూర్- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. రూ.3,175 కోట్ల వ్యయంతో మహబూబ్‌నగర్-గూడెబళ్లూరు మధ్య 80 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ చేపట్టనున్నారు. 231 కిలోమీటర్ల మేర ఆరు లేన్లతో హైదరాబాద్-విజయవాడ మధ్య రూ.10,297 కోట్లతో రహదారి నిర్మించనున్నారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగం)కు రూ.21,629 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రంలో 1242 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లలో కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు మంజూరు కాగా, ఇప్పటి వరకు 627 కిలోమీటర్ల మేర పూర్తి అయింది. 410 కిలోమీటర్ల మేర పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని అన్నారు.

కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సికింద్రాబాద్‌లో ఏర్పాటు అవుతోందని, దేశంలో 7 హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ప్రకటిస్తే అందులో మూడు మన హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభం అవుతున్నాయన్నారు. ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మేడారానికి రూ. 3 కోట్లకు పైగా నిధులను కేటాయించిందని వెల్లడించారు. గనుల కేటాయింపులో టెండర్లు వేసే ముందు సైట్ విజిట్ చేయాలనేది దేశ వ్యాప్తంగా ఉన్న రూల్ ప్రజలకు మేలు చేస్తుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. 17 కంపెనీలు విజిట్ చేస్తే ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదని, నైనీ కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Next Story