ఉపాధి చట్టంలో మార్పులు అందుకోసమే..ఉనికి కోసమే మాపై విమర్శలు : కిషన్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు వారి జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్​జీ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధి చట్టంలో మార్పులు అందుకోసమే..ఉనికి కోసమే మాపై విమర్శలు : కిషన్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు వారి జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్​జీ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) వీబీ జీ రామ్​జీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనేక సంస్కరణలు, అనేక మార్పులతో దేశానికి, పేద ప్రజలకు, వ్యవసాయ రంగానికి మరింత మేలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకురావడంతో పాటు పథకాల్లో అవసరమైన మార్పులు చేసి కొన్ని నూతన పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. జీఎస్టీ పన్ను విధానం కూడా అందులో ఒక ముఖ్యమైన సంస్కరణ. పన్ను వ్యవస్థలో, బడ్జెట్ విధానంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకు వచ్చామన్నారు.

పని అడిగిన ప్రతి కూలీకి తప్పనిసరిగా పని

ఈ నిరంతర సంస్కరణల ప్రక్రియలో భాగంగానే వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) యాక్ట్-2025 ను గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకంలో టెక్నాలజీని వినియోగించి జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేశామని, రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజలు డిమాండ్ చేస్తున్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ మార్పులు చేయడం జరిగిందని చెప్పారు. పని అడిగిన ప్రతి కూలీకి తప్పనిసరిగా పని కల్పించాల్సిందే. ఏ కారణంతోనైనా పని కల్పించలేకపోతే, వారికి పరిహారం చెల్లించాల్సిందే అనే నిబంధనను చట్టంలో పొందుపరిచామన్నారు. పని పూర్తయిన తర్వాత కూలీల అకౌంట్లలో సకాలంలో వేతనాలు జమ కాకపోతే, ఆలస్యానికి సంబంధించి ఫైన్ విధించే విధానాన్ని కూడా ఈ చట్టంలో తీసుకు వచ్చామన్నారు.

గతంలో ఈ పథకంలో అవినీతి అక్రమాలకు చోటు :

గడిచిన కాలంలో ఈ పథకం అమలులో అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు పూర్తి బాధ్యత ఉండే విధంగా అనేక మార్పులు తెచ్చామన్నారు. జియో-ట్యాగింగ్ విధానం ద్వారా ఎక్కడెక్కడ పనులు జరిగాయో ఆ పనులపై కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పర్యవేక్షణ చేస్తుంది. ఈ పథకంతో రాష్ట్రాలపై మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు భారం మోస్తోంది. ఈ సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా రూ.17 వేల కోట్లు అదనంగా ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.340 కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం నిధులు అందించబోతోంది. వ్యవసాయ సీజన్ ఉన్న సమయంలో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లాలి, ఎప్పుడు గ్రామీణ ఉపాధి పనులు కొనసాగించాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల అధికారంలోనే ఉంటుంది. పని కావాలని నమోదు చేసుకున్న కూలీలకు 15 రోజుల్లో పని కల్పించకపోతే, వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా కూడా చట్టంలో పొందుపరిచామన్నారు. యూపీఏ హయాంలో కోల్ స్కామ్ అనుభవంతో పారదర్శకత పెరిగింది. కోల్ స్కామ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కోల్ బ్లాక్స్, మైనింగ్ బ్లాక్స్ అన్నీ ఆక్షన్ ద్వారా పారదర్శకంగా కేటాయిస్తున్నామని ఇది కూడా ఒక పెద్ద సంస్కరణే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. మళ్లీ రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని తమ పార్టీ ఇక్కడ బలంగా ఉంది. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికలు, కౌన్సిల్ ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలే చూశారు.

దేశంలో స్థిరమైన నాయకత్వం బీజేపీదే. దేశవ్యాప్తంగా బీజేపీ వరుసగా నాలుగు, ఐదు సార్లు గెలుస్తోంది. మోడీ ఇప్పటికే మూడోసారి ప్రధాని అయ్యారు. రాబోయే ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయనే దేశ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అడగడంలో తప్పేమీ లేదు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం రాష్ట్ర విభజన చట్టం ఆధారంగా జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడానికి స్పష్టమైన చట్టపరమైన పరిమితులు ఉన్నాయి. గతంలో టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ట్రైబల్ మినిస్ట్రీ నుంచి నిధులు ఇచ్చాం. ఈ సారి కూడా రెండు మంత్రిత్వ శాఖల నుంచి సహకారం అందిస్తాం. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతమ్ రావు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ సీనియర్ నాయకులు డా.ఎస్. ప్రకాశ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వకుళాభరణం తదితరులు పాల్గొన్నారు.

Next Story