చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద అప్రోచ్ రోడ్ల విస్తరణతో పాటు అవసరమైన భూసేకరణను తక్షణమే చేపట్టాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద అప్రోచ్ రోడ్ల విస్తరణతో పాటు అవసరమైన భూసేకరణను తక్షణమే చేపట్టాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు. నగరంలోని ప్రధాన టెర్మినళ్లపై (కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్) పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్రం చేపడుతున్న పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి

ప్రస్తుతం చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తున్న రైళ్లు, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన అత్యవసరమని లేఖలో పేర్కొన్నారు. రూ. 430 కోట్ల ప్రాజెక్టు: ప్రత్యామ్నాయ టెర్మినల్‌గా చర్లపల్లి స్టేషన్‌ను కేంద్రం భారీ నిధులతో అభివృద్ధి చేస్తోంది. ఎఫ్​సీఐ గోడౌన్ రోడ్డు విస్తరణ.. కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనం వైపు ఉన్న ఈ రహదారిని ప్రధాన మార్గంగా మార్చేందుకు 200 అడుగుల వెడల్పుతో విస్తరించాలి. భరత్ నగర్ రోడ్డు విస్తరణ.. ఇటువైపు నుంచి స్టేషన్‌కు వచ్చే ప్రస్తుత 30 అడుగుల రహదారిని కనీసం 100 అడుగులకు పెంచాలి. ఈసీ నగర్ మార్గం అభివృద్ధి.. ఎంఎంటీసీ ప్లాట్ ఫాంకు చేరుకునే ఇరుకైన ఈ రోడ్డును కనీసం 100 మీటర్ల వెడల్పుతో, 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాలి. పార్కింగ్ కోసం ప్రయాణికులు, వాహనాల రద్దీకి అనుగుణంగా కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటీసీ ప్లాట్ ఫాం వైపు 2.70 ఎకరాల అదనపు భూమిని కేటాయించాలి. నీటి కనెక్షన్ కోసం రైల్వే శాఖ ఇప్పటికే ఒప్పందం ప్రకారం రూ. 4 కోట్లు జమ చేసినందున, వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి

భవిష్యత్ రద్దీని తట్టుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి గుర్తుచేశారు. రూ. 715 కోట్లతో ఆధునికీకరణ: అత్యాధునిక సౌకర్యాలతో ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. స్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్‌కు చేరుకోవడానికి ప్రస్తుత రహదారి చాలా ఇరుకుగా ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆల్ఫా హోటల్ నుంచి రాతిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలి.

గత ప్రభుత్వం పట్టించుకోలేదు..

ఈ సమస్యలపై ఇప్పటికే రైల్వే, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక ఇచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆ తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖల ద్వారా ఈ విషయాన్ని తెలిపినా పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఆయన పేర్కొన్నారు. నగరానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని, రోడ్ల విస్తరణ, భూ కేటాయింపులకు తక్షణమే అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.

Next Story