కేసీఆర్ వందల సార్లు తల నరుక్కోవాలి: సీఎంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
కేసీఆర్ వందల సార్లు తల నరుక్కోవాలి: సీఎంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండబోదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అధ్యక్షుడి మార్పుపై అనవసర చర్చలు వద్దని ఆయన సూచించారు. నేతలు క్రమశిక్షణ తప్పి మాట్లాడకూడదని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని కేడర్ మొత్తం గ్రహించాలని చెప్పారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ ఫేస్ ఔట్ డేటెడ్ అని, ప్రధాని మోడీ ఫేస్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. తమ స్ట్రాటజీ ఏంటనేది ఎన్నికల సమయంలో చూస్తారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో గెలిస్తే.. ఇతర రాష్ట్రాల్లో, తెలంగాణలో గెలుస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించే సత్తా, సమర్థత బీజేపీకి మాత్రమే ఉందని ఆయన నొక్కిచెప్పారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కేంద్రం తరుపున నిర్వహణపై నిర్ణయం తీసుకోలేదని, తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు సహా.. ఇతర హామీలిచ్చి వందల సార్లు మాట తప్పారని, ఎన్నోసార్లు ఆయన తల నరుక్కోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం సాయంపై చర్చకు సిద్ధమని కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచడం కోసమే 111 జీవో రద్దు చేయాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ నేతలకు 111 జీవో పరిధిలో వందలాది ఎకరాలున్నాయని ఆయన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి మాట్లాడుకుని కార్యాలయాలకు భూములు తీసుకున్నారని ఆయన అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి భూ దాహం, అప్పుల దాహం తీరడం లేదని విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం‌ కేసీఆర్ హాజరుకావపోవటం తెలంగాణకు తీవ్ర నష్టమని కిషన్ రెడ్డి అన్నారు. నీతీ ఆయోగ్ సమావేశం కంటే కేసీఆర్‌కు ముఖ్యమైన పని ఏముందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

30 వేల ఎకరాలను అమ్మడానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో రద్దుతో ఎప్పటికైనా హైదారాబాద్‌కు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. 111జీవో ఎత్తివేస్తే హైదరాబాద్ ఏమైపోతుందోననేది ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. అప్పులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. 135 ఏళ్ళ చరిత్ర కలిగిన వరంగల్ సెంట్రల్ జైలు భూములు తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు.

గుణాత్మకమైన మార్పు తీసుకొస్తానన్న కేసీఆర్ ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నాడని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర నుంచి కొందరు తలకుమాసిన వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్‌లో చేరుతున్నారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల‌ కోట్లు బకాయిలు చెల్లించాలని, తీసుకున్న అప్పుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read..

తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్!

BRS అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు నష్టమే: మంత్రి కిషన్ రెడ్డిNext Story