రైతుల నుంచి పత్తి చివరి కేజీ వరకు కొనుగోలు చేస్తాం : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

by Naga Rani Yarlagadda |

పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు జరపాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరినట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.

రైతుల నుంచి పత్తి చివరి కేజీ వరకు కొనుగోలు చేస్తాం : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి
X
  • అన్నదాతలకు అమ్మకాల విషయంలో ఆందోళన అవసరం లేదు
  • ప్రధాని మోడీ దూరదృష్టితో తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు
  • సమ్మక్క, సారలమ్మ విశ్వవిద్యాలయం లోగో​ ఆవిష్కరణ చేయడం ఆనందంగా ఉంది : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​

దిశ, తెలంగాణ బ్యూరో : పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు జరపాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరినట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. పత్తిని చివరి కేజీ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. గతేడాది తెలంగాణలో సీసీఐ ద్వారా 80 శాతం వరకు పత్తిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పత్తిలో తేమ శాతాన్ని తగ్గించి, కొనుగోలు కేంద్రాలకు పంపే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పాటు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏటా కొన్ని సమస్యలు వస్తుంటాయని వాటిని కేంద్రం ఎప్పటికప్పుడూ పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. మార్కెట్‌లోకి రైతులంతా ఒకేసారి పత్తిని తీసుకురావడంతో జిన్నింగ్ మిల్లుల వాళ్లు కొనుగోలు చేయలేకపోతున్నారు. అందుకే సరికొత్త యాప్ తీసుకొచ్చామని, ఈ యాప్ ద్వారా ఎప్పుడు ఎవరు మార్కెట్ కు రావాలని స్లాట్ లు కేటాయిస్తారు. దీంతో రైతులు, మిల్లర్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదన్నారు. దళారుల ప్రమేయాన్ని, అవినీతి తగ్గించేందుకే కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చి సీసీఐ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఇతర దేశాల్లో కాటన్ ధర తక్కువగా ఉందని అయినా కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటోంది. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పత్తి తేమ తగ్గించే బాధ్యత తీసుకోవాలి. హై డెన్సిటీ కాటన్ ప్లాంటేషన్ ద్వారా రైతుల ఆదాయం మూడింతలు అవుతోంది. తెలంగాణలో ఎందుకు ఆ విత్తనాలను ఎందుకు వినియోగించట్లేదని కేంద్ర మంత్రిని అడిగినట్లు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. 12 శాతం తేమ కన్నా ఎక్కువ ఉండకుండా కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకురావాలని కోరారు. తేమ ఎక్కువ ఉంటే కొనకుండా వెనక్కి పంపవద్దని, పత్తి కొనుగోళ్లకు సబంధించి నిధులు, సాంకేతికత, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందన్నారు. కనీసం రైతుల సంక్షేమం కోసం చేయాల్సిన చిన్న పనులు చేస్తూ సహకారం అందించాలి. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రం అండగా నిలబడుతుంది. రైతులు తొందరపడి పత్తిని బయట తక్కువ ధరకు అమ్ముకోవద్దు. 122 సెంటర్లలోని రైతుల కమిటీల అభ్యర్థులు, అధికారులకు రైతులు సమస్యలను చెబితే వారు వెంటనే పరిష్కరిస్తారు. తేమ శాతాన్ని కచ్చితత్వంతో కొలిచే ఆధునిక మెషీన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు.

కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చొరవతో గిరిజన యూనివర్శిటీ : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​

సమ్మక్క సారలమ్మ కేంద్ర విశ్వవిద్యాలయం లోగో ప్రారంభించుకోవడం తనకు ఆనందంగా ఉందని, ప్రధాని మోడీ దూరదృష్టితో, కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణలో గిరిజనుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ యూనివర్సిటీ కల నిజమైందన్నారు. దీని కోసం కేంద్రప్రభుత్వం ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా నిధులను కేంద్రం కేటాయించింది. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల వారికి కూడా ఈ యూనివర్సిటీ సేవలు అందిస్తుందని తెలిపారు. స్థానిక ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త కోర్సులను తీసుకురావాలి. వర్సిటీని కొత్త కొత్త పరిశోధనలు, సృజనాత్మకతకు వేదికగా మార్చాలి. ఎంతో విలువైన భారత ఆయుర్వేద విలువలు, గిరిజనుల ఆహారం గురించి కోర్సుల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన భాషల్లో కూడా పాఠ్యాంశ బోధన ఉండాల్సిన అవసరం ఉంది. ములుగు పరిసర ప్రాంతాల్లో యువత క్రీడా నైపుణ్యం ఉంటుంది. వారు క్రీడల్లో రాణించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. లోగో రూపకల్పనలో సృజనాత్మక ఇమిడి ఉంది. పలు తెగల భాషలకు సంబంధించిన పదాలను లోగోలో వాడటం చాలా అద్భుతమైన నిర్ణయమన్నారు.

సమ్మక్క సారలమ్మ కేంద్ర విశ్వవిద్యాలయం మోడీ ఏర్పాటు చేయడం గొప్ప విషయం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రదాని మోడీ నేతృత్వంలో సాధించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇదే సంవత్సరం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన సమ్మక్క సారక్క పండుగను జరుపుకుంటామన్నారు.కోట్లాది మంది భక్తుల నమ్మకానికి అనుగుణంగా మోడీ ఈ వర్సిటీకి సమ్మక్క సారక్క పేరు పెట్టుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా యూనివర్సిటీకి భూమిని కేటాయించింది. యూనివర్సిటీకి సంబంధించి భవనాల నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరినట్లు చెప్పారు.

Next Story