- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి పరిస్థితి బాలేదు.. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి : కార్మికులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సింగరేణిలో దుబారా ఖర్చులు పెరుగుతున్నాయని, వాటిని తగ్గించుకోవాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలో దుబారా ఖర్చులు పెరుగుతున్నాయని, వాటిని తగ్గించుకోవాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కొత్తగూడెంలోని పద్మావతి ఖని 5-ఇంక్లయిన్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్మికుల ముఖాముఖిలో మాట్లాడుతూ.. ఢిల్లీ బోర్డు మీటింగుల్లో సింగరేణిపై తీసుకునే ప్రతీ నిర్ణయం, చర్చించిన విషయాలన్నీ కార్మికులకు తెలియాలన్నారు. 8 జిల్లాల ప్రజలు సింగరేణిపైనే ఆధారపడి జీవిస్తున్నారని, లక్షలాది కుటుంబాలకు ఉపాధిని ఇస్తోన్న సింగరేణిని కాపాడుకోవాలన్నారు. ప్రస్తుతం సింగరేణి పరిస్థితి బాగాలేదని, దానిని సరైన గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. నాణ్యమైన ఉత్పత్తిని పెంచాలని, అందుకు అవసరమయ్యే కార్యాచరణను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. సంస్థ బాగుంటే కార్మిక సంఘాలు, నాయకత్వం బాగుంటుందని హితవు పలికారు. రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసే కార్మికులు సంస్థను రక్షించుకోవాలని, ఇందుకు కేంద్ర నుంచి వీలైనంత సహాయ సహకారాలను అందిస్తామన్నారు.
విదేశాల నుంచి బొగ్గు దిగుమతిని తగ్గిస్తామని చెప్పారు. గతేడాది రూ.60 వేల కోట్ల దిగుమతుల్ని తగ్గించామని, ఈ ఏడాది కూడా బొగ్గు దిగుమతుల్ని తగ్గించి, సింగరేణి బొగ్గుగు ప్రాధాన్యమిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో బొగ్గు ద్వారా 74 శాతం బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు నిరంతరం జాగ్రత్తగా ఉండాలని, జీరో పర్సెంట్ ప్రమాదాలు లేకుండా, బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులతో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు సింగరేణి చైర్మన్ & ఎండీ కృష్ణభాస్కర్, కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపేందర్ కూడా పాల్గొన్నారు.






