- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలి : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. మంగళవారం బహిరంగ లేఖ ద్వారా పేర్కొంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలను ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదంటూ హామీల అమలుకు తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఖజానా ఖాళీ అన్న ముఖ్యమంత్రి ఇటీవల ఓ సభలో కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వారి వ్యాఖ్యలు చూస్తే రాష్ట్ర ఖజానా నిల్, పార్టీ నాయకుల జేబులు ఫుల్‌గా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇచ్చిన హామీలను అమలు చేయమంటే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలకు బదులు ఖాళీ మట్టి కుండలు ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడి హామీల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ సోనియా-రాహుల్ గాంధీ కుటుంబానికి, పార్టీకి అవసరమైతే రూ. 1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం చూస్తుంటే పార్టీ నేతలు దోచుకున్నట్లు ప్రజలకు అర్థమైందన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం..
కేంద్రంలో మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి తెలంగాణ అభివృద్ధికి అనేక రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తున్నారు.. గత 12 సంవత్సరాల కాలంలో దాదాపు రూ. 12 లక్షల కోట్ల నిధులను రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా నిధులు, రూ.1.85 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం, దాదాపు రూ.36 వేల కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగిందన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో రూ. 50 వేల కోట్ల విలువైన రైల్వే పనులు, దాదాపు రూ.40 వేల కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50 వేల కోట్ల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఇచ్చామన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు వివిధ ఆర్థిక సంఘాల సిఫారసుల ద్వారా అందిస్తున్న రూ.40 వేల కోట్లకు పైగా నిధులు, రూ.12 వేల కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14 వేల కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80 వేల కోట్లకు పైగా నిధులు, విద్య, క్రీడలకు రూ.21 వేల కోట్లకు పైగా నిధులు, దాదాపు రూ.9 వేల కోట్ల ఆరోగ్య సంరక్షణకు మంజూరు చేసినట్లు తెలిపారు.
రైతులకు మద్దతు ధర కోసం రూ. 60వేల కోట్లు చెల్లింపు..
రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించి మరో రూ.60 వేల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించినట్లు పేర్కొన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు రూ. 10 లక్షల కోట్ల రుణాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి అందించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రహిత రుణాల మీద ఆధారపడటం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాంటి దుస్థితిలో ఉందో తెలుస్తోందన్నారు. గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించడానికి రుణాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రుణాలు, రైతు భరోసా నిధులకు రుణాలు, సంక్షేమ పథకాల అమలుకు రుణాలు ఇలా చెప్పుకుంటూ పోతే రుణాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉందన్నారు. 2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్దం పడుతోందన్నారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పెరుగుతున్న రాష్ట్ర తలసరి అప్పు కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితిని తెలియజేస్తోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఒక పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






