యువతలో స్ఫూర్తిని నింపనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్‌: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

by Ramesh Naini |

మై భారత్ పోర్టల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్‌ కార్యక్రమం యువతలో స్ఫూర్తిని నింపనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.

యువతలో స్ఫూర్తిని నింపనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్‌: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మై భారత్ పోర్టల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్‌ కార్యక్రమం యువతలో స్ఫూర్తిని నింపనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. శుక్రవారం కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. దేశ నిర్మాణం దిశలో యువతే కీలకమన్నారు. త్వరలో నిర్వహించనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్‌ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని స్మరించుకోవడానికి సర్దార్@150 యూనిటీ మార్చ్‌ను మేరా యువ భారత్ (MY Bharat) పోర్టల్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

నిస్వార్థ సేవ, ఏకత, దేశ నిర్మాణం వంటి ఆదర్శ భావనలకు సర్దార్ పటేల్ మార్గ దర్శకత్వం వహించారు. ఈ భావనలకు ప్రతీకగా జాతీయ స్థాయిలో చేపట్టే కార్యక్రమాల్లో యువత ముందువరుసలో నిలవాలని సూచించారు. ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనం కావడంలో సర్దార్ పటేల్ చరిత్రాత్మకమైన పాత్రను పోషించారని ప్రస్తావించారు. ఆయన దార్శనికతతో, దృఢసంకల్పంతో పూనుకోకపోతే భారత్‌లో హైదరాబాద్ విలీనం సాధ్యమయ్యేదే కాదు అని మంత్రి స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం, ఆయన నాయకత్వం అందించిన స్ఫూర్తితో జాతీయ సమగ్రత, ఏకత, యువజన భాగస్వామ్యం వంటి ఆదర్శ భావనలను ఒక ఉత్సవంగా జరుపుకునే కార్యక్రమమే సర్దార్@150 యూనిటీ మార్చ్ అని మంత్రి అభివర్ణించారు. ఎమ్ వై భారత్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ (ఇన్‌ఛార్జి) అన్షుమన్ ప్రసాద్ దాస్, ఎన్ఎస్ఎస్ ప్రాంతీయ డైరెక్టర్ ఎం.రామకృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Next Story