- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క: బండి సంజయ్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రక్షాళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నడుం బిగించారు.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రక్షాళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) నడుం బిగించారు. అందులో భాగంగా సోమవారం కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు. టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ, ఎసీపీలుసహా సిబ్బంది అంతా హాజరైన ఈ సమావేశంలో ‘‘ఇప్పటిదాకా ఒక లెక్క. ఇకపై మరో లెక్క. ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల కోసం డబ్బులు అడగొద్దు.. బాధితులను ఇబ్బంది పెట్టొద్దు. అవినీతికి తావు లేకుండా ఇంటి అనుమతుల కోసం వచ్చే ప్రజలకు సులువుగా అనుమతి ఇచ్చేలా చేయాల్సిందే. బ్రోకర్ల ద్వారా ఏజెన్సీలను పెట్టుకుని ప్రజలను వేధిస్తూ లంచాలు తీసుకుని అనుమతి ఇవ్వాలనుకుంటే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే బదిలీపై వెళ్లవచ్చు. నిజాయితీగా రూల్స్ ప్రకారం పనిచేసే వాళ్లపై మా రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. వాళ్లపై ఈగ కూడా వాలనివ్వను. కంటికి రెప్పలా కాపాడుకుంటా’’ అని స్పష్టం చేశారు.
ఇబ్బంది పెడితే నష్టపోయేది మీరే..
మిమ్ముల్ని బెదిరించడానికో, భయపెట్టడానికో పిలవలేదు. పూర్తి పారదర్శకతో పనిచేయాలి. మీరు నిజాయితీగా, నిబంధనల ప్రకారం పనిచేస్తూ ఇంటి పర్మిషన్ల కోసం మీ వద్దకు వచ్చే ప్రజలకు సులువుగా అనుమతి ఇచ్చే విషయంలో మీకు పూర్తిగా స్వేచ్ఛనిస్తున్నా. మీరు తప్పు చేస్తే భగవంతుడు కూడా మిమ్ముల్ని కాపాడలేరు. మీపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోవద్దు. మా బీజేపీ కార్పొరేటర్ల నుండి ఒత్తిళ్లు రాకుండా నేను చూసుకుంటా. మీరు మాత్రం నిజాయితీగా ఉంటూ నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. అట్లా చేస్తే మీపై ఈగను కూడా వాలనివ్వను. మిమ్ముల్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను పూర్తిగా నేనే తీసుకుంటా. రూల్స్‌కు భిన్నంగా అధికార పార్టీతో అంటకాగుతూ అవినీతికి పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం నష్టపోయేది మీరే.
కాళ్లరిగేలా తిప్పించుకోవద్దు..
ఇకపై మీ దగ్గరకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. కసరుకోవద్దు. చిరునవ్వుతో పలకరించండి. వారికి నిబంధనలను వివరించి అందుకు అనుగుణంగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేలా సహకరించండి. అనుమతి ఇవ్వండి. టౌన్ ప్లానింగ్ అంటేనే కరప్షన్ అనే భావన ప్రజల్లో పేరుకుపోయింది. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇకపై మరో లెక్క. టౌన్ ప్లానింగ్ లో కరప్షన్‌పై మీడియాలో వార్తలు వస్తే వెంటనే స్పందించాలి. తగిన చర్యలు తీసుకోవాలి. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే సులువుగా అనుమతి ఇవ్వాలే తప్ప రూల్స్ పేరుతో రకరకాల కొర్రీలు పెట్టి ప్రజలను ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకోవద్దు. బ్రోకర్లతో, ఏజెన్సీలతో పని లేకుండా వాళ్లకు పైసలిచ్చుకునే పని లేకుండా ఈజీగా ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలి. అందుకోసం మున్సిపల్ ఆఫీసుకు వచ్చే ప్రజల కోసం ‘హెల్ప్ డెస్క్’ తరహా టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక పేరుతో డెస్క్‌ను ఏర్పాటు చేయాలి. కరీంనగర్ మున్సిపల్ పాలక వర్గం మారింది. నెలరోజుల్లో కచ్చితంగా మార్పు కన్పించాలి. కొత్త పాలకవర్గం మార్క్ చూపాల్సిందే. కొంతమంది అధికారులు సొంతంగా బ్రోకర్లను, ఏజెన్సీలను ఏర్పాటు చేసుకుని వాళ్ల ద్వారా పనులు చేయిస్తూ పైసలు దండుకుంటున్నారు. ఇకపై అట్లా ఉండటానికి వీల్లేదు. అవినీతితో సంపాదించిన పాపపు సొమ్ము ఎక్కువ కాలం ఉండదు. మీ కుటుంబానికి ఆ సొమ్ము మంచిది కూడా కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఇంకా అవినీతిని కొనసాగిస్తామనుకుంటే మాత్రం కరీంనగర్‌లో ఉండటానికి వీల్లేదు. బదిలీపై వెళ్లొచ్చు. వాళ్లకు నేను సహకరించి బదిలీ చేయిస్తా.
ఆ విషయాలన్నీ నాకు తెలుసు..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏ విభాగంలో ఏ అధికారి ఏ విధంగా పనిచేస్తున్నారు? అవినీతికి పాల్పడుతున్నారా? అధికార పార్టీతో అంటకాగుతున్నారా? అనే విషయాలన్నీ నాకు తెలుసు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నాకు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. మున్సిపల్ అధికారులపై నిఘా ఉంటుంది. మీరేం చేస్తున్నారో పక్కా సమాచారం వస్తుంది. గతంలో మీరు ఏం చేశారో నాకు అనవసరం. ఇకపై మాత్రం అవినీతికి దూరంగా ఉండాలి. పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వాలి. సహకరించాలి. అనుమతి లేకుండా అనధికారికంగా ఇండ్లు, కమర్షియల్ భవనాలు నిర్మిస్తుంటే.. ఆరంభంలోనే వాటిని ఆపాలి. నోటీసులివ్వాలి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఎన్ని నిర్మాణాలు అక్రమంగా, అనధికారికంగా కొనసాగుతున్నాయో గుర్తించి వాటన్నింటినీ వారం రోజుల్లోపు నోటీసులివ్వండి. నోటీసులకు సమాధానం ఇవ్వకపోయినా, అక్రమ నిర్మాణాలను కొనసాగించినా కొరడా ఝుళిపించండి. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సహాయం వాటిని కూల్చివేయండి. ప్రభుత్వ స్థలాలను పూర్తిగా కాపాడాలి.
గతంలో కరీంనగర్‌లో ఇంటి ముందు ఇసుక, కంకర కన్పిస్తే ఒకవైపు కార్పొరేటర్లు, ఇంకోవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు వాలిపోయి బెదిరించి వసూళ్లు చేసే వాళ్లు. అలాంటి కార్పొరేటర్లను ప్రజలు తిరస్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వాళ్లలో 46 మంది కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లే ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ కార్పొరేటర్లు అలాంటి వాటి జోలికి పోరు. ఇతర పార్టీల కార్పొరేటర్లు ఎవరైనా వాటికి అలవాటు పడితే రూల్స్ ప్రకారం వ్యవహరించండి. ఇకపై అలాంటి వాటికి తావు లేకుండా ఉండటం కోసం మూడు రోజుల్లోగా కార్పొరేటర్లు, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, శానిటేషన్ విభాగాల అధికారులతో ‘‘అవగాహన సదస్సు’’ను ఏర్పాటు చేయండి.
మళ్లీ చెబుతున్నా. మా నుండి మీపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. నెలరోజుల్లో మున్సిపల్ ఆఫీసులో మార్పు రావాలి. కరీంనగర్ లో ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే చాలా సులువుగా అనుమతి వస్తుందనే నమ్మకం ప్రజలకు రావాలి. ఆచరణలో చూపాలి. కరీంనగర్ స్ఫూర్తితో రాష్ట్రమంతటా టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పులకు నాంది పలకాలి. ఆ విధంగా మీరు పనిచేసి చూపండి.
కరీంనగర్‌కు ఐకానిక్‌గా ఉండే ప్రాజెక్టులు ఏమైనా ఉంటే చెప్పండి. వాటి అమలు కోసం, నిధుల కోసం నేను ప్రయత్నిస్తా. పెద్ద ఎత్తున సీఎస్సార్ ఫండ్స్ తీసుకొస్తా. అతి త్వరలోనే ‘‘అటల్ క్యాంటీన్’’లను ఏర్పాటు చేసి ఆసుపత్రులు, మార్కెట్ కూడళ్లలో పేదలకు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని కడుపు నిండా పెట్టేలా చర్యలు తీసుకుంటానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.






