మార్చి నాటికి అంతమొందిస్తాం: నక్సలిజంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

నక్సలైట్ల విషయంలో తమ లైన్ వెరీ క్లియర్ అని, వచ్చే మార్చి నాటికి నిర్మూలించి తీరుతామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు...

మార్చి నాటికి అంతమొందిస్తాం: నక్సలిజంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నక్సలైట్ల విషయంలో తమ లైన్ వెరీ క్లియర్ అని, వచ్చే మార్చి నాటికి నిర్మూలించి తీరుతామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లు కాల్చి చంపిన కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులైన శ్రీధర్ బాబు, పర్ణికారెడ్డి నక్సలిజం ఫిలాసఫీని ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. నక్సలిజం ఓ ఫిలాసఫీ అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఏమనాలని ప్రశ్నించారు.

‘‘తుపాకీ పట్టి అమాయకులను, ఆదివాసీ బిడ్డలను చంపడం సిద్ధాంతమా?, అడ్డొచ్చిన పోలీసులను మందు పాతరలు పెట్టి చంపడమే నక్సలిజం సిద్దాంతమా?. నుదిటిపై తుపాకీ పెట్టి కాలుస్తుంటే వాళ్లతో చర్చలు జరపాలా?. కాంగ్రెస్ నేతలను కాల్చి చంపిన చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు పర్ణికారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లాగే శ్రీపాదరావును కాల్చి చంపారు. ఆయన కొడుకు శ్రీధర్ బాబు నక్సలైట్ల ఫిలాసఫీకి మద్దతిస్తారా?. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను తుపాకీ గొట్టంతో కూలుస్తామంటే ఊరుకుందామా?. జాతీయ జెండాలను తగలబెట్టి నల్లా జెండాలను ఎగరేసే నక్సలైట్ల ఫిలాసఫీకి మద్దతిస్తారా?. ప్రభుత్వంలో నక్సలైట్ల తుపాకీ గొట్టానికి స్థానం లేదు. అందుకే వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతాం. అభివృద్ది, సంక్షేమ ఫలాలను ఆదివాసీ గూడెంలకు, తండాలకు, మారుమూల పల్లెలకు అందిస్తాం.’’ అని బండి సంజయ్ తెలిపారు.

Next Story