- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు తప్పు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పుగా ఉన్నాయని, ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అట్లాంటి భాష వాడకం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హితువు పలికారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పుగా ఉన్నాయని, ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అట్లాంటి భాష వాడకం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హితువు పలికారు. సీఎం హోదాలో హుందాగా వ్యవహరించాలని ఇక నుంచి అలాంటి భాష వాడొద్దని, తెలంగాణ ప్రజలు సీఎం వ్యాఖ్యలపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం కంటే పెద్ద శని తెలంగాణలో లేదని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కుటుంబమని, ప్రజలు గమనించే కేసీఆర్ ను ఫాంహౌజ్ కే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. స్వరాష్ట్ర ఏర్పడిన తర్వాత ఆయన కుటుంబం తప్ప ఇంకొకరు బాగుపడలేదని మండిపడ్డారు. కృష్ణ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే ముమ్మాటికీ దోషి కేసీఆరే అవుతాడు. 575 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు చాలు అని అంగీకరించిన వ్యక్తి , అపెక్స్ కమిటీ సమావేశంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చెప్పినట్లు గుర్తు చేశారు. దీనిపై అవసరమైతే నాటి ఒప్పందాలను బయటపెట్టేందుకు సిద్ధమని, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం సిగ్గు చేటు అన్నారు.
ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, పంచాయతీలకు సీఎం బిచ్చమేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో పంచాయతీకి సగటున రూ.కోటి ఇవ్వాలని కేంద్రం నుండి రూ.3 వేల 5 కోట్లు పంచాయతీలకు రాబోతున్నారని ముఖ్యమంత్రే ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టే ఆదాయంతో ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నిరాశ, ఆందోళనలో ఉన్నారని, వారంతా తిరగబడే రోజులు వచ్చాయన్నారు. కేబినెట్ లో ఇద్దరు, ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని వేల కోట్ల అక్రమాలు సంపాదిస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రుల అక్రమాలపై రిపోర్టులు తెప్పించుకుంటున్నామని మంత్రుల భాగోతమంతా త్వరలోనే బయటపెడతామన్నారు. సమయం చూసి కాంగ్రెస్ కరప్షన్, అక్రమాలపై బీజేపీ పోరాటం చేయబోతోందన్నారు.
కాళేశ్వరం స్కామ్బయట పెట్టడం లేదు :
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల స్కాం జరిగితే రూ. 9 వేల కోట్ల అక్రమాలపైనే విచారణకు పరిమితం ఎందుకు చేశారని, ఎవరిని కాపాడేందుకు రూ.లక్ష కోట్ల అక్రమాలపై విచారణ జరపడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పినా స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు. సుమోటోగా తీసుకుని దానంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ ను తలపిస్తోంది. ప్రభాకర్ రావు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉందన్నారు. నక్సలైట్ల జాబితాలో మా పేర్లు చేర్చిన మూర్ఖుడు కేసీఆర్, 6 వేల మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసిన చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గెలవగానే కాంగ్రెస్ ఎగిరెగిరి పడుతోందని, పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కేసీఆర్ సర్కార్ బాటలోనే రేవంత్ పాలన కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ తో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తుంది. భాగ్యనగరాన్ని మజ్లిస్ కు ధారాదత్తం చేయడానికి కాంగ్రెస్ ప్లాన్ చేసిందని, మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్ బీజేపీ లక్ష్యమని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ ను ఓడించి తీరుతామని సవాల్విసిరారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల కోసం తాము ఎదురు చూస్తున్నామని, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కార్యకర్తలు కసితో ఉన్నారు. మోడీ పాలనలో భారత్ లో మైనార్టీలపై దాడులు జరగడం లేదనే విషయాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. ఆయన పాలన మతాలకు అతీతంగా సాగుతోందన్నారు. గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారని ప్రస్తుతం ఆయన స్వేచ్ఛా జీవిగా ఉన్నాడని అన్నారు.






